తెలంగాణ అసెంబ్లీ… తొలి రోజే రచ్చ రచ్చ..!!
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఊహించని రీతిలో హైఓల్టేజ్ రాజకీయ వేడిని రాజేశాయి. ఒకవైపు సభా వేదికగా భావోద్వేగాలు, తీవ్రస్థాయి వాగ్వాదాలు, ప్రతిపక్షంపై అధికార పక్షం ఎదురుదాడితో సభ అట్టుడకగా.. మరోవైపు అసెంబ్లీ వెలుపల బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు, అరెస్టులు, పోలీసుల తీరుపై హైకోర్టు జోక్యంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం సభను కుదిపేసింది. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్సీని తక్షణమే పదవి నుంచి డిస్మిస్ చేయాలని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని కాంగ్రెస్ పక్షం పట్టుబట్టింది. ఈ క్రమంలో మంత్రి సీతక్క అత్యంత భావోద్వేగానికి లోనై మాట్లాడారు. దళిత, అణగారిన వర్గాల ప్రతినిధిగా ఉన్నత స్థానంలో కూర్చున్న స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా స్పీకర్ సైతం తీవ్ర మనస్తాపానికి గురై సభలోనే కంటతడి పెట్టడం అధికార పక్షాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది.
ఈ ఉదంతాన్ని రాజకీయంగానూ కాంగ్రెస్ బలంగా తిప్పికొట్టింది. స్పీకర్‌పై చేసిన దాడి వ్యక్తిగతమైనది కాదని, అది దళిత సమాజంపై జరిగిన దాడిగా అధికార పక్ష ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మొదటినుంచీ దళిత వ్యతిరేక వైఖరితోనే వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఆ వర్గాలపై చిన్నచూపు చూస్తోందని సభలో దుయ్యబట్టారు. రాజకీయ విభేదాలను స్పీకర్ వ్యవస్థపై రుద్దడం దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
అంతకు ముందు సభ ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెలుపల తీవ్రస్థాయి నిరసన చేపట్టారు. బ్లాక్ టీషర్టులు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం. తోపులాట జరిగింది. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ నేతలు రోడ్డెక్కారు. హరీశ్ రావు తదితరులు టీషర్టులు విప్పేసి హంగామా సృష్టించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి నేతలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఈ తోపులాటలో ప్రతిపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపానికి గురై కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ నిర్బంధకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
ఇటు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ నడుస్తుండగానే, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సభలో నిరసన గళం విప్పారు. వివాదాస్పద 22ఏ భూముల వ్యవహారంలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభాపతి పోడియం వైపు దూసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. 22ఏ భూముల సమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించేందుకు సిద్ధంగా ఉందని, సభలో చర్చించి వాస్తవాలను బయటపెడతామని హామీ ఇవ్వడంతో ఆ వివాదం కొంత సద్దుమణిగింది.
అసెంబ్లీ పరిసరాల్లో ప్రజాప్రతినిధులపై పోలీసుల అత్యుత్సాహం, తోపులాటల వ్యవహారం చివరకు హైకోర్టు మెట్లెక్కింది. అసెంబ్లీ గేట్ల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ పేరిట జరిగిన సంఘటనలపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కాగా.. కోర్టు విచారణ చేపట్టి పోలీసుల వైఖరిపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
మొత్తంగా, శాసనసభ మొదటిరోజే జరిగిన ఈ పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను తేటతెల్లం చేశాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు, సభా సంప్రదాయాల ఉల్లంఘనలే మొదటిరోజు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ సెగలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.









