తాతా మధు వ్యాఖ్యల కలకలం.. అసలేంటీ గొడవ?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకోగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. ఈ తోపులాట క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి తీవ్రమైన, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలు సభ లోపల, వెలుపల అగ్గి రాజేశాయి.
అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు నిలువరించిన సమయంలో తన వస్త్రాలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాతా మధు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆదేశాలతోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని భావించిన ఆయన, స్పీకర్ స్థానాన్ని, ఆయన్ను ఉద్దేశించి అనుచిత పదజాలం వాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శాసన మండలి సభ్యుడిగా ఉంటూ, అసెంబ్లీ స్పీకర్‌ను బహిరంగంగా దూషించడం సభా హక్కుల ఉల్లంఘన మాత్రమే కాక, రాజ్యాంగ వ్యవస్థల ఉనికికే విఘాతమని అధికార కాంగ్రెస్ పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ చైర్‌ను అవమానించడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను, సభా ఔన్నత్యాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. తాతా మధును తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, ఎమ్మెల్సీ పదవికి ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు, ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని తేల్చిచెప్పారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే నేతలు ఇలాంటి భాష మాట్లాడుతున్నారని, దళిత వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చోవడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని సీఎం విమర్శించారు.
ఇవి కూడా చదవండి
గతంలోనూ దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడం, దళితులకు మూడెకరాల భూమి హామీని గాలికొదిలేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ను “దళిత వ్యతిరేక పార్టీ”గా కాంగ్రెస్ అభివర్ణించింది. మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌పై అలాంటి అనుచిత భాష వాడటం ప్రజాస్వామ్యానికి చేటు అని, తాతా మధును బర్తరఫ్ చేయాల్సిందేనని అన్నారు. అయితే, సభలో ఇతర సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించగా, సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానాన్ని దూషిస్తే బీజేపీ ఎందుకు రాజీ పడుతోందని, తమ చీకటి మిత్రులను కాపాడే ప్రయత్నం మానుకుని ఈ చర్యను ఏకగ్రీవంగా ఖండించాలని సీఎం సవాల్ విసిరారు.
తెలంగాణ శాసనసభ వేదికగా మొదలైన ఈ వివాదం కేవలం ఒక ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. అది దళిత ఆత్మగౌరవం, బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య రాజకీయ ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందింది. గత కొద్దికాలంగా బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై దూకుడుగా వెళ్తుండగా, అసెంబ్లీ ముఖద్వారం వద్ద జరిగిన ఈ వివాదం అధికార కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రాన్ని అందించింది. స్పీకర్ పదవి రాజ్యాంగపరమైనది కావడంతో తాతా మధుపై సభా హక్కుల సంఘం ద్వారా చర్యలు తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి ఆవేశంలో వాడిన అనుచిత పదజాలం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారానికి కేంద్రబిందువైంది.








