ట్రంప్ ప్రకటనతో హాలీవుడ్ ఫుల్ ఖుష్.. అసలు ఏం జరిగిందంటే?
ఒకవైపు హాలీవుడ్‌పై విమర్శలు. మరోవైపు కాలిఫోర్నియాపై అసహనం. మధ్యలో తనదైన రాజకీయ వ్యాఖ్యలు. ఇలా తన సోషల్ మీడియా పోస్టులో ఎప్పటిలాగే కాస్త అటూ ఇటూ మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ చివరికి హాలీవుడ్‌కు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మాట చెప్పేశారు.ఏమిటా పెద్ద మాట అంటే..
“అమెరికాలో సినిమాలు తీస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి” అని. అంటే ఓ రకంగా హాలీవుడ్‌ను ‘డిజాస్టర్’ అంటూ విమర్శించిన ట్రంపే ఇప్పుడు హాలీవుడ్‌ను కాపాడేందుకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారన్న మాట!
అసలు హాలీవుడ్‌కు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి?
ఒకప్పుడు భారీ సినిమాలు ఏవైనా సరే అమెరికాలోనే షూటింగ్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హాలీవుడ్ నిర్మాతలు కెమెరాలు తీసుకుని, తమ నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి లండన్‌కు వెళ్తున్నారు.మరికొందరు కెనడాకు వెళ్తున్నారు. ఇంకొందరు యూరప్‌లోని ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు.
ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు “మీ సినిమా ఇక్కడ తీస్తే… మేం మీకు ట్యాక్స్‌లో రాయితీ ఇస్తాం.” అని ప్రకటిస్తున్నాయి. ఇస్తున్నాయి. సినిమా బడ్జెట్ వందల కోట్లలో ఉన్నప్పుడు చిన్న ట్యాక్స్ రాయితీ కూడా చిన్న విషయం కాదు కదా! అందుకే పెద్ద పెద్ద హాలీవుడ్ ప్రొడక్షన్లు అన్నీ అమెరికా బయటకు వెళ్లిపోతున్నాయి.
దీని దెబ్బ ఎవరికి పడుతోంది?
అమెరికాలోని సినిమా కార్మికులకు. టెక్నీషియన్లకు. స్టూడియోలకు. సినిమా షూటింగ్‌లపై ఆధారపడిన చిన్న వ్యాపారాలకు. ముఖ్యంగా హాలీవుడ్‌కు గుండె లాంటి లాస్ ఏంజెలెస్‌లో షూటింగ్‌లు పూర్తిగా తగ్గిపోయాయి.అదే పెద్ద సమస్యగా మారింది.
ట్రంప్ ఇప్పుడు చెప్పింది ఏంటి?
ట్రంప్ మాటను చాలా సింపుల్‌గా చెప్పాలంటే… “సినిమాలు అమెరికా వదిలి బయటకు వెళ్లిపోవద్దు. ఇక్కడే తీయండి. అందుకు ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకం ఇస్తుంది” అనేదే.
అమెరికాలో సినిమా, టీవీ, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి వెంటనే చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు. దీని కోసం ఫెడరల్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరారు. ఇన్నాళ్ళూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే సినిమా నిర్మాతలకు ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ చెబుతున్నది ఏమిటంటే… రాష్ట్రాలే కాదు… కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి రావాలి.
హాలీవుడ్ ఇంతకాలం అడిగింది కూడా ఇదే!
కాలిఫోర్నియా, జార్జియా వంటి రాష్ట్రాలు ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు ట్యాక్స్ క్రెడిట్లు ఇస్తున్నాయి. కానీ సమస్య ఏంటంటే… లండన్, కెనడా వంటి ప్రాంతాలు ఇస్తున్న ఆఫర్లతో పోలిస్తే అమెరికాలోని రాష్ట్రాల ప్రోత్సాహకాలు సరిపోవడం లేదని హాలీవుడ్ భావిస్తోంది.
ఇప్పుడు హాలీవుడ్ కు పండగలా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం ట్యాక్స్ రాయితీ ఇస్తోంది. దానికి అదనంగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా ఇంకో ప్రోత్సాహకం ఇస్తానంటోంది. అప్పుడు నిర్మాతకు అమెరికాలో షూటింగ్ చేయడం మళ్లీ లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలను తిరిగి అమెరికాలోకి తీసుకురావడమే ఈ రాయతీల వెనుక ఉన్న అసలు లక్ష్యం.
హాలీవుడ్ ఫుల్ ఖుషీ
ట్రంప్ ప్రకటన రావడంతో మోషన్ పిక్చర్ అసోసియేషన్ కూడా వెంటనే స్వాగతించింది. వాళ్ల లెక్క చాలా క్లియర్. సినిమాలు అమెరికాలోనే తీస్తే స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి. షూటింగ్ జరిగే ప్రాంతాల్లో వ్యాపారం పెరుగుతుంది. టెక్నీషియన్లు, నటీనటులు, స్టూడియోలు అందరికీ పని దొరుకుతుంది. అంతేకాదు… సినిమా నిర్మాణానికి అమెరికా మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుందని పరిశ్రమ ఆశిస్తోంది.
ఈ ఆలోచన వెనుక జాన్ వోయిట్ ఉన్నారా?
ట్రంప్ ఈ నిర్ణయానికి రావడంలో నటుడు జాన్ వోయిట్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్, సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ట్రంప్‌కు జాన్ వోయిట్ సలహాలు ఇస్తున్నారు. ఇంతకుముందు ట్రంప్ సినిమా పరిశ్రమపై టారిఫ్‌లు విధించే విషయం కూడా మాట్లాడారు. అయితే ఆ ఆలోచనపై పెద్దగా ముందడుగు పడలేదు. ఇప్పుడు మాత్రం దారి మార్చినట్లు కనిపిస్తున్నారు.
“బయటి దేశాల సినిమాలపై చర్యలు తీసుకోవడం కంటే… మన దేశంలో సినిమాలు తీయడానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఎలా ఉంటుంది?” అనే దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ… ఇప్పటివరకు ఇది కేవలం ఒక ఐడియానే!
ఇక్కడే అసలు మెలిక ఉంది. ట్రంప్ మద్దతు ప్రకటించారు. హాలీవుడ్ సంతోషించింది. పరిశ్రమలో ఆశలు పెరిగాయి. కానీ ఇంకా చట్టం రూపంలో ఏదీ బయటకు రాలేదు.
అలాగే ఎంత ట్యాక్స్ రాయితీ ఇస్తారు? ఎలాంటి సినిమాలకు ఇస్తారు? చిన్న నిర్మాతలకు కూడా వర్తిస్తుందా? లేదా భారీ హాలీవుడ్ స్టూడియోలకేనా? దీనికి అమెరికా ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? ఇవన్నీ ఇంకా క్లారిటీ లేని ప్రశ్నలే.
ట్రంప్ నిజంగానే హాలీవుడ్‌ను కాపాడతారా?
ఇదంతా చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హాలీవుడ్‌ను విమర్శించడం వేరే. అలాగే అమెరికా నుంచి సినిమా వ్యాపారం బయటకు వెళ్లిపోవడం ఆపాలనుకోవటం వేరే. ఈ రెండింటినీ ట్రంప్ ఇప్పుడు ఒకేసారి చేస్తున్నారు.
ఎందుకంటే సినిమా అంటే కేవలం హీరోలు, అవార్డులు, రెడ్ కార్పెట్ మాత్రమే కాదు. దాని వెనుక వేలాది ఉద్యోగాలు ఉన్నాయి. కోట్లాది డాలర్ల వ్యాపారం ఉంది. అమెరికా నుంచి ఆ వ్యాపారం లండన్, కెనడా, యూరప్‌కు వెళ్లిపోతుంటే… దాన్ని తిరిగి తీసుకురావాల్సిందేనన్న ఆలోచన ఇప్పుడు వాషింగ్టన్లో మొదలైనట్లు కనిపిస్తోంది.
ఫైనల్ గా..
ట్రంప్ చేసిన ఈ ప్రకటన నిజంగా చట్టంగా మారి హాలీవుడ్‌కు ఊపిరి పోస్తుందా? లేక…ఇది కూడా ట్రంప్ సోషల్ మీడియా పోస్టుల్లో వచ్చిన మరో పెద్ద ప్రకటనగానే మిగిలిపోతుందా? దానికి సమాధానం రావాలంటే కాంగ్రెస్ ఏమంటుందో చూడాల్సిందే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








