అమెరికా నేవీ కొత్త చీఫ్ హుంగ్ కావో..!
అగ్రరాజ్యం అమెరికా నేవీకి కొత్త అధిపతి ఖరారయ్యారు. పూర్తిస్తాయి నేవీచీఫ్ హుంగ్ కావోను ఎంపిక చేశారు అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతం తాత్కాలిక నేవీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న హుంగ్ కావోను పూర్తిస్థాయి పదవికి నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, కావోను “నిజమైన యోధుడు” అని అభివర్ణించారు. ఆయన తన పనిని కొనసాగించేందుకు సెనేట్ ఈ నియామకాన్ని త్వరగా ఆమోదించాలని కోరారు.
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్తో తీవ్ర విభేదాల కారణంగా ..నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ ఆకస్మికంగా వైదొలగడంతో, ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి హుంగ్ కావో తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు, 2025 అక్టోబర్‌లో ఆయన అండర్ సెక్రటరీ ఆఫ్ ది నేవీగా బాధ్యతలు స్వీకరించారు. ఫెలాన్తో పోలిస్తే కావో.. రక్షణ మంత్రి హెగ్సెత్కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
1975లో దక్షిణ వియత్నాం పతనం తర్వాత హుంగ్ కావో.. ఒక శరణార్థిగా అమెరికాకు వలస వచ్చారు. ప్రతిష్ఠాత్మక యూఎస్ నావల్ అకాడమీ నుంచి పట్టభద్రులై, 25 ఏళ్లకు పైగా నేవీ స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, సోమాలియా వంటి దేశాల్లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. 2021లో కెప్టెన్ హోదాలో పదవీ విరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, రిపబ్లికన్ పార్టీ తరఫున 2022లో ప్రతినిధుల సభకు, 2024లో సెనేట్‌కు పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఇరాన్‌కు సంబంధించి అమెరికా సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్న తరుణంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి యుద్ధ నౌకలు తొమ్మిది నెలలకు పైగా సుదీర్ఘ కాలం పాటు మోహరించడంతో సిబ్బందిలో ఒత్తిడి పెరుగుతోందన్న నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకల నిర్మాణం, దళాల సంసిద్ధత, మాతృభూమి రక్షణే తన ప్రాధాన్యతలని హుంగ్ కావో ఇప్పటికే స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ నామినేషన్‌కు సెనేట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.








