నాడు పరిశ్రమలు.. నేడు గోదావరి జలాలు..!
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఐటీ, పాలిటెక్నిక్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ(Polavaram Left Canal) ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా ఈ ప్రాంత నీటి అవసరాలను తీర్చేందుకు ఈ అడుగు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ పోలవరం ఎడమ కాలువ నీటి విడుదల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని దాదాపు 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, అక్కడి వ్యవసాయం పూర్తిగా స్థిరీకరణ చెందుతుందని లోకేష్ వివరించారు. రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడం ద్వారా ఈ ప్రాంతాల్లో పంటల దిగుబడి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గుర్తుచేశారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర రీజియన్‌కు అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచామని, ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ‘గోదావరి’ జలాలను అందిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యతని లోకేష్ స్పష్టం చేశారు. ‘సమగ్రాభివృద్ధి.. సర్వతోముఖాభివృద్ధి’ అనే నినాదంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలుపుతామని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.








