సంస్కృతిని కాపాడటంలో టీటీఏ కీలకం: దిల్ రాజు
అమెరికాలోని చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస తెలుగువారితో మమేకమవుతూ, తెలుగు సినిమా, సంస్కృతి , భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దిల్ రాజు ప్రసంగం…
బతుకమ్మ , బోనాలు వంటి మన పండుగలను అమెరికాలో ఉంటున్న తర్వాతి తరానికి పరిచయం చేస్తూ, సంస్కృతిని కాపాడటంలో టీటీఏ సంస్థ ఒక వారధిగా పనిచేస్తోందని దిల్ రాజు ప్రశంసించారు. యువతకు అర్థవంతమైన కథలను అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను కదిలించిన ‘బలగం’ సినిమా ఒక క్లాసిక్గా నిలిచిందని గుర్తుచేశారు. ఆ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిన ఆదరణ తనకు ఎంతో భావోద్వేగపూరితమని అన్నారు.
‘బలగం’ సినిమాలోని అదే ఎమోషనల్ సారాంశంతో, అదే స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ను రూపొందిస్తున్నానని దిల్ రాజు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తన సినిమాలకు అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాలు ప్రేక్షకులకు, తనకు మధ్య ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. టీటీఏ అందిస్తున్న సేవలను కొనియాడిన దిల్ రాజు, తర్వాతి తరానికి మన విలువలను అందించేందుకు టీటీఏ చేపట్టే భవిష్యత్తు కార్యక్రమాల్లో తాను తప్పకుండా భాగస్వామ్యుడినవుతానని, తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.








