టిటిఎ వేడుకల్లో తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావుకు అవార్డు
ఛార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మహాసభల్లో మొదటిరోజున జరిగిన బాంక్వెట్ వేడుకల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరు పొందిన వారికి అవార్డులను అందజేశారు. అందులో మీడియారంగానికి చేసిన సేవలకు గాను తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు టిటిఎ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా చెన్నూరి సుబ్బారావుపై ప్రదర్శించిన ఎవి అందరినీ ఆకట్టుకుంది. గత 23 ఏళ్ళుగా అమెరికాలోని తెలుగువారికి మీడియా తరపున ఆయన సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అటు పత్రికాపరంగా మరోవైపు విదేశాంధ్రులను జన్మభూమికి కనెక్ట్ చేయడంలోనూ, ప్రభుత్వానికి ఎన్నారైలకు మధ్య వారధిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. అలాగే హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలు కంపెనీలను కూడా ఎన్నారైల దగ్గరకు తెలుగు టైమ్స్ ద్వారా చేరువ చేస్తున్నారు. అమెరికాలో టీటీడి, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉత్సవాలను అమెరికాలోని వివిధ నగరాల్లో మొదటిసారి నిర్వహించిన ఘనత కూడా సుబ్బారావుకు దక్కుతుంది. ఆయనకు అవార్డు ఇవ్వడం పట్ల పలువురు ఎన్నారైలు, తెలుగు సంఘాలవారు అభినందనలు తెలియజేశారు.










