అమెరికా నేవీలో భారతీయ యువతి సత్తా.. 300 మంది క్యాడెట్లకు నాయకత్వం వహిస్తున్న రిద్ది చౌహాన్!
అమెరికా నావికాదళ శిక్షణా విభాగంలో ఒక భారతీయ యువతి అసాధారణ నాయకత్వ పటిమతో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ మూలాలు కలిగిన రిద్ది చౌహాన్, ప్రస్తుతం న్యూయార్క్‌లోని బెంజమిన్ ఎన్.కార్డోజో హైస్కూల్లో నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్(NJROTC) విభాగంలో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే 300 మంది అమెరికన్ క్యాడెట్లను నడిపిస్తూ, సైనిక క్రమశిక్షణతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రిద్ది తల్లిదండ్రులు దిలీప్ చౌహాన్, రుచిక, ఉద్యోగ రీత్యా అమెరికా వలస వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను గుండెల్లో దాచుకుంటూనే అమెరికాలోని అత్యంత కఠినమైన రక్షణ రంగానికి సంబంధించిన శిక్షణలో ఆమె తనదైన ముద్ర వేసింది.
అంచెలంచెలుగా ఎదుగుతూ…
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే రిద్ది NJROTC ప్రోగ్రామ్‌లో చేరింది. నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను పెంపొందించుకోవాలనే బలమైన సంకల్పంతో ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థి దశలోనే అకడమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ప్లటూన్ లీడర్, ట్రైనింగ్ లీడింగ్ పెట్టీ ఆఫీసర్ వంటి కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఆమె బాధ్యతలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ ఉదయం 7 గంటలకే డ్రిల్ ఫీల్డ్‌లో ఉంటూ, క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం, పోటీలకు సిద్ధం చేయడం, వారిని సమన్వయం చేయడం రిద్ది దినచర్యలో భాగం.
అకాడమిక్స్, రోబోటిక్స్‌లో ప్రతిభ…
రిద్ది కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాలేదు. అకడమిక్స్‌లో టాపర్‌గా నిలవడమే కాకుండా, సాంకేతిక రంగంలోనూ తన పట్టును నిరూపించుకుంది. వరుసగా రెండేళ్లపాటు పాఠశాల బృందాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ లెవెల్ లీడర్షిప్ అండ్ అకాడమిక్ బోల్ రెండో రౌండ్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా, బెటాలియన్‌లోనే తొలిసారిగా రూపొందించిన ‘సీపెర్చ్ అండర్ వాటర్ రోబోట్’ ప్రాజెక్టు తయారీలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించి సత్తా చాటింది.
నాయకత్వం అంటే కేవలం హోదా లేదా అధికారం కాదని, ఇతరులపై చూపే సానుకూల ప్రభావమేనని రిద్ది బలంగా నమ్ముతుంది. తన నాయకత్వంలో ప్రతి క్యాడెట్ తాము విలువైనవారమని, తమకు మద్దతు లభిస్తోందని భావించేలా వాతావరణాన్ని కల్పించడం తన బాధ్యత అని ఆమె చెబుతోంది. సమర్థవంత నాయకత్వం వ్యక్తులను, సంస్థలను ఎలా మార్చగలదో తాను స్వయంగా చూశానని ఆమె పేర్కొంది. BAPS బాలికా సేవక్ శిక్షణ, మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నేర్చుకున్న వినయం, నిజాయతీ, నిస్వార్థ సేవ వంటి విలువలు తన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడ్డాయని ఆమె తెలిపింది.
భవిష్యత్తులో అమెరికా నావికాదళంలో నేరుగా నేవల్ ఆఫీసర్ కావడమే అంతిమ లక్ష్యమని చెప్పింది. ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యూఎస్ నేవల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్’లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తన విజయంతో ప్రవాస భారతీయులకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఆడపిల్లలకు, ముఖ్యంగా యువతకు ఆమె రోల్ మోడల్‌గా నిలుస్తోంది. రిద్ది సాధించిన ఈ అద్భుత విజయాలపై అమెరికాలోని ఎన్నారైలు, భారతీయులు గర్వపడుతున్నారు.








