మాస్ కా దాస్ విశ్వక్సేన్ ‘#CULT’ సాంగ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరోసారి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్లో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ముందుకొచ్చే ఆయన ఇప్పుడు #CULT తో పూర్తిగా కొత్త జానర్లో రాబోతున్నారు. విశ్వక్సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రాన్ని సందీప్ కాకరాల తారక్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నిజ జీవితంలోని భయానక సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని నెలకొల్పింది.
ఆ ఆసక్తిని మరింత పెంచుతూ తాజాగా చిత్ర బృందం తొలి పాట ‘హీ ఈజ్ మై దోస్తీ’ ని విడుదల చేసింది. పాట ప్రారంభంలోనే స్నేహం అంటే ఏమిటో విశ్వక్సేన్ తనదైన శైలిలో వివరిస్తారు. స్నేహితుడితో ఎప్పుడూ కలిసి ఉండలేకపోయినా, అతడు లేకుండా జీవితాన్ని ఊహించలేని అనుబంధమే నిజమైన స్నేహమని చెబుతూ పాట సాగుతుంది.
తమ జీవితంలో తొలిసారిగా గోవా ట్రిప్‌కు వెళ్లిన స్నేహితుల బృందం అక్కడి నైట్‌లైఫ్, విదేశీ పర్యాటకులు, ఫ్రీ లైఫ్ స్టైల్ ఆస్వాదించే సన్నివేశాలు ఉత్సాహభరితంగా కనిపిస్తాయి.
సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్ ఆకట్టుకోగా, సంతోష్ వెంకీ రాసిన సాహిత్యం స్నేహంలో ఆప్యాయతను, అనుబంధాన్ని చక్కగా ప్రజెంట్ చేసింది. సింగర్ కార్తీక్ తన ట్రెండీ వోకల్స్‌తో ఈ పాటకు మరింత ఆకర్షణను తీసుకొచ్చారు.
విజువల్‌గా ఈ పాట గోవా అందాలను, సందడిని చూపిస్తూనే, అక్కడ దాగి ఉన్న చీకటి ప్రపంచాన్ని కూడా సూచిస్తుంది. పాట ముందుకు సాగే కొద్దీ సినిమాలోని క్రైమ్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ కనిపిస్తాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్సేన్ మరోసారి తన ప్రత్యేక నటనతో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భార్టియా, విశాక్ నాయర్, చేపూరి వివేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశ్వక్సేన్ విజన్‌కు బలంగా నిలిచే సాంకేతిక బృందం కూడా ఈ చిత్రానికి పని చేస్తోంది. తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించగా, సంగీతాన్ని రవి బస్రూర్ సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ విజువల్స్‌ను అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే భారీ సెట్స్‌తో చిత్రానికి అంతర్జాతీయ స్థాయి లుక్ తీసుకొస్తున్నారు.
అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న #CULT చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు.








