బీజేపీలోకి మల్లారెడ్డి? శ్రావణమాసంలో ముహూర్తం!!
తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ వికెట్ పడేందుకు రంగం సిద్ధమైందా? గులాబీ కోటలో కీలక నేతగా వెలిగిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్కు శాశ్వతంగా రాంరాం చెప్పేస్తున్నారా? ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ గూటి నుంచి బయటకు వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లా గులాబీ శ్రేణులకు కూడా వీరి వ్యవహారంపై అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో, బీఆర్ఎస్ వర్గాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మల్లారెడ్డి కుటుంబానికి రాజకీయ గండం పట్టుకుంది. గతంలో రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన తీవ్ర విమర్శలు, సవాళ్లు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన విద్యాసంస్థలు, వ్యాపార సామ్రాజ్యంపై నిబంధనల ఉల్లంఘనలు, భూ ఆక్రమణల ఆరోపణలతో ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. దీంతో తమ అపారమైన వ్యాపార, విద్యా సామ్రాజ్యాలను కాపాడుకోవడమే ప్రస్తుతానికి తమ ప్రాధాన్యత అని, ప్రభుత్వాల వేధింపుల వల్లే తాము పార్టీకి దూరంగా ఉండాల్సి వస్తోందని మల్లారెడ్డి అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం.
తొలుత అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మల్లారెడ్డి కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి వారిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. కాంగ్రెస్ తలుపులు మూసుకుపోవడంతో, మల్లారెడ్డి చూపు సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మళ్లింది. బీజేపీ జాతీయ పార్టీ కావడంతో, అక్కడ రక్షణ పొందితే తెలంగాణలో తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవచ్చని, భవిష్యత్తుకు ఢోకా ఉండదని ఈ మామ-అల్లుళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో, కమలం కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
మల్లారెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మేడ్చల్ జిల్లా నాయకుల అంతర్గత సమావేశంలో ఓ కీలక నేత మాట్లాడుతూ.. “మల్లారెడ్డి గ్రూప్‌ను ఇక వదిలేయండి, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్టీ కార్యక్రమాలకు పిలవద్దు” అని కేడర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీనికి తగ్గట్లుగానే శనివారం నాటి సరూర్ నగర్ బీఆర్ఎస్ బహిరంగ సభకు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి గైర్హాజరయ్యారు. అదే సమయంలో తన నియోజకవర్గ పరిధిలో జరిగిన ‘అందెశ్రీ స్మృతివనం’ భూమిపూజ కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరయ్యారు. ఆ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా, మల్లారెడ్డి నవ్వుతూ అదే వేదికపై కూర్చోవడం గులాబీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో మల్లారెడ్డి బీఆర్ఎస్కు పూర్తిగా దూరమయ్యారనే సంకేతం కేడర్‌కు బలంగా వెళ్లిపోయింది.
తొలినాళ్లలో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. “మామ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను” అని ప్రకటించినప్పటికీ, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుటుంబమంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లారెడ్డి కోడలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పట్లో వారు ఆ వార్తలను ఖండించినప్పటికీ, లోపల మాత్రం స్క్రిప్ట్ సిద్ధమైందని టాక్. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, తాజాగా బీజేపీ ఇన్ చార్జ్ అభయ్ పాటిల్ సంచలన ప్రకటన చేశారు. శ్రావణమాసం ప్రారంభం కాగానే తెలంగాణలో బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ చేరికల లిస్టులో మల్లారెడ్డి కుటుంబమే మొదటి స్థానంలో ఉందనేది ఓపెన్ సీక్రెట్.
మొత్తానికి, గులాబీ నీడలో వ్యాపారాలు సాగవని గ్రహించిన మల్లారెడ్డి, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు కమలం అండను ఆశ్రయిస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ మాజీ మంత్రి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలో బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.








