కేటీఆర్ చెప్పిన పులివెందుల ఖైదీ కథ!
రాజకీయాల్లో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలు ఉంటాయి. కానీ, కొన్ని సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన, కాస్త భయపెట్టే.. చివర్లో నవ్వించే అనుభవాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు. అది 2009 నాటి ముచ్చట. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తొలి రోజుల్లో, జైల్లో ఒక పులివెందుల ఖైదీ చేతిలో కేటీఆర్ ఎలా షేవింగ్ చేయించుకోవాల్సి వచ్చిందో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన గుర్తు చేసుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘కార్టునిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు 2026’ ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
నవంబర్ 29, 2009.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి సిద్ధిపేట వెళ్తుండగా అలగనూరు వద్ద పోలీసులు కేసీఆర్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కేటీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒకే కారులో పోలీసు వాహనాలను వెంబడించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో కలిసి కేటీఆర్ ధర్నాకు దిగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ రాత్రికి కేటీఆర్‌ను జైలుకు తరలించారు.
జైల్లో తొలి రాత్రి గడిచింది. జైలు సిబ్బంది, జైలర్ కేటీఆర్‌ను మర్యాదగా చూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం చాయ్ తాగిన తర్వాత, గడ్డం గీసుకోవడానికి జైలర్ ఏర్పాట్లు చేశారు. జైలు ఆవరణలోని ఒక చెట్టు కింద కేటీఆర్‌ను కూర్చోబెట్టి, అక్కడే శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీని పిలిపించి షేవింగ్ చేయమన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఖైదీ కత్తి తీసి కేటీఆర్ పీక మీద పెట్టాడు. సాధారణంగా సెలూన్‌కు వెళ్లినప్పుడు మాటలు కలపడం అలవాటే కాబట్టి, కేటీఆర్ కూడా చాలా క్యాజువల్‌గా.. “ఏ ఊరు తమ్ముడూ మీది?” అని అడిగారు. అవతలి నుంచి వచ్చిన సమాధానం వినగానే కేటీఆర్ గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. “మాది పులివెందుల సార్” అన్నాడు ఆ ఖైదీ.
అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి కేవలం నాలుగు నెలలే అయింది. వైఎస్సార్ మరణంతో అటు ఆంధ్రా, రాయలసీమలో తీవ్ర భావోద్వేగాలు ఉన్నాయి. ఇటు తెలంగాణలో కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. అలాంటి సమయంలో.. పైగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్న పులివెందుల ఖైదీ చేతిలో కత్తి ఉంది.. అది కరెక్ట్‌గా కేటీఆర్ పీక మీద ఉంది!
ఆ ఊరి పేరు వినగానే కేటీఆర్ అలెర్ట్ అయ్యారు. “ఇక ముచ్చట బంద్ ఆడికి.. అప్పటికే కత్తి పీక మీద ఉంది, ఇంకేం మాట్లాడతాం? సైలెంట్‌గా ఉండిపోయాను” అంటూ కేటీఆర్ నాటి భయానక, ఆసక్తికర క్షణాన్ని నవ్వుతూ వివరించారు. అయితే, ఆ ఖైదీ మాత్రం కేటీఆర్ భయాన్ని గమనించి కాసేపటికి నవ్వేశాడు. “నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం సార్.. అలాగని కేసీఆర్ అన్నా ఇష్టమే. నాలాగా గట్టిగా కొట్లాడేటోళ్లంటే నాకు చాలా ఇష్టం” అని ఆ పులివెందుల సోదరుడు చెప్పడంతో కేటీఆర్ ఊపిరి పీల్చుకున్నారు.
రాజకీయాల్లో పడి నిరంతరం ఒకే మూసలో కొట్టుకుపోతుంటామని, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి కవులు, కళాకారులు, చిత్రకారుల వేదికలపైకి వస్తే మనసు తేలికవుతుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ కార్టునిస్ట్ ఆర్కే లక్ష్మణ్ సేవలను ఆయన కొనియాడారు. నేటి తరం కార్టునిస్టులంతా ఆయనకు ఏకలవ్య శిష్యులేనన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉన్నంత కాలం ప్రజలకు మేలు చేయడమే ముఖ్యమని, గాంధీజీ సిద్ధాంతాలు దేశానికి ఎల్లప్పుడూ అవసరమని కేటీఆర్ ఈ వేదికగా వ్యాఖ్యానించారు.








