పశ్చిమాసియాలో భీకర రణం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..!
తమపై దాడులు ఆపకుంటే అమెరికాకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామంటూ ఇరాన్ హెచ్చరించింది. శాంతి ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంతకం విలువ లేనిదని, నిష్ప్రయోజనమన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమైనీ. అమెరికా కొనసాగిస్తున్న దాడులకు నిరసనగా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలోని హామీలను సస్పెండు చేస్తున్నామని ఇరాన్ ప్రకటించిన అనంతరం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. దానిని ఇరాన్ అధికార టీవీలో చదివి వినిపించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు.
‘అమెరికా మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. ఆ దేశ విశ్వాస ఘాతుకానికి ఇది నిదర్శనం. అమెరికా ఇలాగే దాడులను కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇరాన్, దాని సైనిక శక్తులవద్ద మరిచిపోలేని పాఠాలున్నాయి. వాటిని అమెరికాకు నేర్పిస్తాం’ అని ఖమేనీ హెచ్చరించారు. మరోవైపు రెండు దేశాల మధ్య దాడులు.. మరింతగా విస్తరించి నీటి వనరులపైకి మళ్లాయి.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన ఒప్పందానికి ఇరాన్ (Iran) కట్టుబడి ఉండకపోవడాన్ని పెద్దగా పట్టించుకోనని అన్నారు. అయితే, ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా నిలువరించాలన్నదే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.ఇరుదేశాల మధ్య కుదిరిన ఎంవోయూ నుంచి వైదొలగుతున్నట్లు టెహ్రాన్ చేసిన ప్రకటనపై మీరేమంటారు అని విలేకరి ప్రశ్నించగా.. అలాంటి చర్యలను ఖాతరు చేయబోనన్నారు.
పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా- ఇరాన్ మధ్య జూన్ నెలలో తాత్కాలిక అవగాహన ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. 14 పాయింట్లతో కూడిన ఎంవోయూపై ఇరుదేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే హర్మూజ్ కేంద్రంగా మళ్లీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దాని నిర్వహణపై పట్టు సాధించేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నించడంతో పరిస్థితులు మొదటికి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకోగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది.








