మరోసారి తండ్రైన జేడీ వాన్స్…. !
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంలోకి మరో వారసుడొచ్చాడు. ఆయన సతీమణి ఉషా వాన్స్ ఆదివారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. అతనికి అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టామని చెప్పారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ జేడీ వాన్స్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తమ ముగ్గురు పిల్లలు తమ్ముడిని చూసి ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు.
2014లో ఉష, జేడీ వాన్స్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు- ఇవాన్ (9ఏళ్లు), వివేక్ (6ఏళ్లు), కుమార్తె మిరాబెల్ (4ఏళ్లు) ఉన్నారు. ఇప్పుడు నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. ఉషా వాన్స్ తెలుగు మూలాలున్న వ్యక్తి . ఈ క్రమంలోనే తమ చిన్న కుమారుడి పేరులో ‘నీల్’ అని చేర్చడం ఆసక్తికరంగా మారింది.
కాగా.. పదవిలో ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబంలో చిన్నారి జన్మించడం 156 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో నాటి ఉపాధ్యక్షుడు కోల్ఫాక్స్ పదవిలో ఉండగా.. ఆయన భార్య ఎల్లెన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు.
కాగా జేడీ వాన్స్.. తన వ్యక్తిగత , రాజకీయ జీవితంలో ఉషా వాన్స్ పాత్ర ఎంతో కీలకమని ఇదివరకే చెప్పుకొచ్చారు. ఆమె రాకతో తాను తిరిగి క్రైస్తవంలోకి మారినట్లు వెల్లడించారు. అంతేకాదు..తను క్రమశిక్షణతో పిల్లల్ని పెంచుతుందన్నారు.








