అమెరికాలో 250వ స్వాతంత్రోత్సవ సందడి.. మాజీ అధ్యక్షులతో కలిసి ఫుట్ బాల్ వీక్షించే ఆలోచనలో ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 250వ దేశ స్వాతంత్రోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్, అలాగే బుష్ కుటుంబ సభ్యులను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, అందరూ కలిసి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించే ఆలోచన ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు ముందు శుక్రవారం విడుదలైన యూఎస్ ద్వితీయ మహిళ ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘స్టోరీటైమ్ విత్ ద సెకండ్ లేడీ’ అనే పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో భాగంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ అనే పుస్తకాన్ని ట్రంప్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా గతంలో అధ్యక్షులుగా ఉన్నవారు తమ ఖాళీ సమయాన్ని ఎలా గడిపేవారనే విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో వైట్‌హౌస్‌లో ఒక అధ్యక్షుడు సూపర్ బౌల్ మ్యాచ్ లైవ్ వీక్షణను హోస్ట్ చేస్తున్న పేజీని చూసిన ట్రంప్.. తనకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పారు. “బరాక్ హుస్సేన్ ఒబామా, జో బైడెన్, బుష్లను కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఇదొక అద్భుతమైన స్టోరీ అవుతుంది కదా, దీనికి ప్రెస్ ఊగిపోతుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఉషా వాన్స్ స్పందిస్తూ.. “ప్రెసిడెంట్స్ రీయూనియనా? చాలా సరదాగా ఉంటుంది” అని అన్నారు.
ఈ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు ట్రంప్ గత అధ్యక్షులపై పలు ఆసక్తికర, హాస్యభరిత వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో రన్నింగ్ ట్రాక్ నిర్మించుకున్న మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. “క్లింటన్ మంచి వ్యక్తి, నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టమే. కానీ నేను మాత్రం వైట్‌హౌస్‌లో రన్నింగ్ ట్రాక్ నిర్మించే పని ఎప్పటికీ చేయను” అంటూ నవ్వులు పూయించారు.
అలాగే అమెరికాకు అత్యంత భారీ కాయుడైన అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన విలియం హోవార్డ్ టాఫ్ట్ బేస్‌బాల్ ఆడుతున్న చిత్రాన్ని చూసి.. “ఆయన చాలా లావుగా ఉండేవారు, బేస్‌బాల్ మ్యాచ్‌లలో హాట్ డాగ్స్ తినడం ఆయనకు ఇష్టం. మన దేశానికి ఆయనే అత్యంత బరువైన అధ్యక్షుడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన రికార్డును నేను బద్దలు కొట్టాలని అనుకోవడం లేదు” అంటూ చమత్కరించారు. వైట్‌హౌస్‌లో ఉండేది తక్కువ కాలమే అయినా, ప్రజల కోసం కష్టపడి పనిచేయడమే ఒక గౌరవంగా భావిస్తానని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు.








