అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫెడరల్ కోర్ట్ షాక్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)నకు స్థానిక కోర్టులో షాక్ తగిలింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ ఇమ్మిగ్రెంట్ వీసా (Immigrant Visa) ప్రాసెసింగ్‌ను నిలిపివేయాలని ఈ ఏడాది జనవరిలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం (US Court) కొట్టేసింది. ఈ ప్రకటన ఫెడరల్ వలస చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జీనెట్ వెల్లడించారు. వలస వీసాల విషయంలో కాన్సులర్ అధికారుల జోక్యంపై విదేశాంగ కార్యదర్శికి ఉన్న అధికారాన్ని ఆ చట్టం తొలగించిందన్నారు. వారి వీసాలను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
కేవలం దరఖాస్తుదారుల జాతీయత ఆధారంగా సమూహాలుగా వీసాలను నిలిపివేయడం లేదా నిషేధించడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కు పూర్తిగా విరుద్ధం.. ఇది “చట్టవిరుద్ధం” అని కోర్టు స్పష్టం చేసింది. మార్కో రూబియో తన చట్టబద్ధమైన అధికార పరిధిని మించి ఈ ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. వీసాల జారీ ప్రక్రియలో కాన్సులర్ అధికారుల వ్యక్తిగత నిర్ణయాధికారాన్ని పరిమితం చేసే హక్కు విదేశాంగ శాఖకు లేదని వెల్లడించారు. ఈ పాలసీ ఆధారంగా గతంలో తిరస్కరించిన వీసా దరఖాస్తులన్నింటినీ కోర్టు రద్దు చేసింది. నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుల అర్హతలను ఒక్కొక్కటిగా (Case-by-case) పరిశీలించి వీసాలు జారీ చేయాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది.
2026 జనవరి 21న ట్రంప్ ప్రభుత్వం ఒక వివాదాస్పద ఉత్తర్వును తీసుకువచ్చింది. దీని ప్రకారం 75 దేశాలకు చెందిన పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియను నిరవధికంగా నిలిపివేశారు. ఈ దేశాల నుండి వచ్చే వలసదారులు భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై (Public Charge) ఆధారపడి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందనే నెపంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని సమర్థించుకుంది. ఈ నిషేధిత జాబితాలో భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు రష్యా, బ్రెజిల్, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఇరాక్, సోమాలియా, ఈజిప్ట్, నైజీరియా వంటి మొత్తం 75 దేశాలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వల్ల చట్టబద్ధంగా వలస వెళ్లాలనుకునే వేలాది కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇమ్మిగ్రెంట్ హక్కుల సంఘాలు (Catholic Legal Immigration Network, African Communities Together వంటివి), ప్రభావితమైన దరఖాస్తుదారులు , అమెరికా పౌరులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అనుకూల తీర్పు వచ్చింది.ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం పైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది
‘‘75 దేశాల వ్యక్తులు అమెరికా ప్రజల నుంచి ఆమోదయోగ్యం కానంత అధికంగా సంక్షేమ ఫలాలు పొందుతున్నారు! అందుకే వారికి ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం. కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను సంగ్రహించకుండా రక్షణ కల్పించేంతవరకూ, వారు మాకు భారంగా మారరని నిర్ధారణ అయ్యేంతవరకూ ఈ నిలిపివేత అమల్లో ఉంటుంది. ట్రంప్ సర్కారు ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.








