బంగ్లాదేశ్ దెబ్బకు ఆస్ట్రేలియా ఓపెనర్‌పై వేటు..!
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో(Australia Vs Bangladesh) జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటింగ్ వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఆసీస్ జట్టు, రెండో టెస్ట్ మ్యాచ్ కోసం తమ ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసింది. అతని స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ మాథ్యూ రెన్షాను జట్టులోకి తిరిగి తీసుకువస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22 నుండి మెకే వేదికగా ప్రారంభం కాబోయే రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ఆసీస్ ఈ మార్పు చేపట్టింది.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు కేవలం 198 పరుగులకే కుప్పకూలగా.. ఓపెనర్ జేక్ వెదరాల్డ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 23 మరియు సున్నా (డక్ అవుట్) పరుగులకే పరిమితమయ్యాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగానే అతనిపై సెలెక్టర్లు వేటు వేశారు. మరోవైపు, జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న 30 ఏళ్ల మాథ్యూ రెన్షా.. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఫార్మాట్లో అడుగుపెట్టబోతున్నాడు. అతను చివరిగా 2023లో ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌కు కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.
రెండో టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టులో మార్పులు జరిగినప్పటికీ, వరుసగా ఫామ్ కోల్పోతూ ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌ను మాత్రం జట్టులోనే కొనసాగించారు. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 31 పరుగులు చేసినప్పటికీ, జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడని కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఒప్పుకున్నారు. లాబుషేన్ ఫామ్‌లోకి రావడానికి కోచింగ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన తెలిపారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్, ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్‌లను రిజర్వ్ ఆటగాళ్లుగా కొనసాగిస్తూ.. కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల తుది జట్టును ఆసీస్ బోర్డు ప్రకటించింది.








