‘వడ్డీ కాసుల వాడి’ లా AI కూడా మారుతోందా?
తిరుమల వెంకన్నను “వడ్డీ కాసుల వాడు” అని ఎందుకు అంటారో మనందరికి తెలుసు.
ఆయనకు పద్మావతి అమ్మవారితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి అంటే మాటలా? దేవతల పెళ్లి. అందుకు తగ్గట్టే ఘనంగా చేయాలి. కానీ పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడిని ఆశ్రయించాడు. కుబేరుడు వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడికి రుణం ఇచ్చాడు.
మరి అప్పు అంటే… వడ్డీ కూడా ఉంటుంది. దాంతో కలియుగం ముగిసే వరకు భక్తుల నుంచి వచ్చే కానుకలతో కుబేరుడి అప్పు తీర్చుతానని శ్రీనివాసుడు చెప్పారు. అందుకే… “వడ్డీ కాసుల వాడు.” అని పిలుచుకుంటాం ఆయన. కలియుగం అంతా కూడా ఆయన్నే అనుసరిస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఏఐ కూడా ఆయన్నే అనుసరిస్తోంది. అదెలా అంటారా…
ఇప్పుడు ఒక్కసారి AI ప్రపంచాన్ని చూడండి. క్కడా ఒక భారీ పెళ్లి జరుగుతున్నట్టే ఉంది. పెళ్లికొడుకు పేరు… AI.వేదిక… డేటా సెంటర్లు. పెళ్లి ఖర్చులు… లక్షల కోట్ల రూపాయలు. మరి ఆ డబ్బు? మాగ్జిమం అప్పే.
ఎందుకంటే AI మోడల్ తయారు చేయడం మాత్రమే ఇప్పుడు పెద్ద పనేమీ కాదు. దాన్ని కోట్ల మంది ఉపయోగించాలంటే భారీ data centers కావాలి. వేలాది, లక్షలాది AI chips కావాలి. సర్వర్లు కావాలి. కూలింగ్ కావాలి. విద్యుత్ కావాలి. కొత్త power infrastructure కావాలి. ఇవన్నీ నిర్మించడానికి కంపెనీలకు డబ్బు కావాలి. అది కూడా కొద్దిగా కాదు. భారీగా కావాలి. అవును AI కి కూడా కుబేరుడు కావాలి. ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. పని నడిపిస్తున్నారు.
ఎంత అప్పు అయ్యింది ఇప్పటికి
ఆ క్రమంలో టెక్ దిగ్గజాలు bond market వైపు చూస్తున్నాయి. 2026లో AI-related debt దాదాపు రూ.5 లక్షల కోట్ల స్థాయికి చేరుతోంది. ఇది ఒక్క కంపెనీ అప్పు కాదు. AI ecosystem మొత్తం నిర్మించడానికి మార్కెట్ నుంచి వస్తున్న అప్పుల వెల్లువ.
ఇక్కడే మన వెంకన్న కథ మళ్లీ గుర్తొస్తుంది. కుబేరుడు డబ్బు ఇచ్చాడు. ఇక్కడ… investors డబ్బు ఇస్తున్నారు. అక్కడ అప్పుకు వడ్డీ ఉంది. ఇక్కడ కూడా ఉంది. అక్కడ అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇవ్వాలి. అక్కడ ఒక promissory note లాంటి ప్రామిస్ ఉంది. ఇక్కడ bonds, loan agreements, financing contracts ఉన్నాయి. కాలం మారింది. కుబేరుడి స్థానంలో Wall Street వచ్చింది. కానీ… అప్పు మాత్రం అప్పే.
మరి AIకి డబ్బు ఇచ్చే కుబేరులు ఎవరు?
ఇక్కడే సామాన్యడికి తెలియని అసలు కథ ఉంది. AI కంపెనీ అప్పు తీసుకుంటే… బ్యాంకు మేనేజర్ వచ్చి చెక్కు ఇవ్వడు. పెద్ద టెక్ కంపెనీలు bonds జారీ చేస్తాయి. వాటిని insurance companies కొనవచ్చు. Pension funds కొనవచ్చు. Asset managers కొనవచ్చు. Banks కొనవచ్చు. Mutual funds, private-credit investors కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అంటే AIకి వస్తున్న డబ్బు వెనుక…ప్రపంచంలోని వేలాది సంస్థల పెట్టుబడి ఉండొచ్చు.
వాళ్లు ఎందుకు ఇస్తారు?
ఇక్కడే AI కథలో అసలు finance మొదలవుతుంది. ఒక కంపెనీ bond జారీ చేస్తుంది. పెట్టుబడిదారుడు ఆ bond కొంటాడు. కంపెనీ నిర్ణయించిన interest లేదా coupon చెల్లిస్తుంది. కాలం పూర్తయ్యాక అసలు మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వాలి. అంటే AI data center కోసం తీసుకున్న దగ్గరే కథ ముగిసిపోదు. దానికి financing cost ఉంటుంది. వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీని చెల్లించడానికి cash flow కావాలి. ఆ cash flow రావాలంటే… AI business చేసి డబ్బు సంపాదించాలి. ఇదే అసలు ట్విస్ట్.
ఇక్కడే తిరుపతి వెంకన్న కథతో AI కథ కలుస్తుంది.
వెంకన్న కథలో భక్తులు హుండీలో వేసే కానుకలు శ్రీనివాసుడు కుబేరుడి అప్పు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి. AIలో మాత్రం హుండీ లేదు. Revenue ఉంది. అక్కడ భక్తుల కానుకలు. ఇక్కడ customers, enterprises, subscriptions, cloud services, AI products నుంచి వచ్చే ఆదాయం.
అక్కడ భక్తుడు తన వంతు కాసు వేస్తాడు.
ఇక్కడ కస్టమర్ తన subscription fee కడతాడు.
చూస్తుంటే… కథ మారింది. లెక్క మాత్రం పెద్దగా మారలేదు.
అప్పు కట్టలేకపోతే?
ఇదే కథలో అసలు ఉత్కంఠ. AI కంపెనీకి business అనుకున్నంత వేగంగా పెరగకపోతే? Revenue అంచనాలు తప్పితే? Data centerలు అనుకున్నంత ఆదాయం ఇవ్వకపోతే? Interest rates పెరిగితే? కొత్త అప్పు సులభంగా దొరకకపోతే? అప్పుడు పాత అప్పు భారంగా మారుతుంది. వడ్డీ చెల్లింపులు ఒత్తిడిగా మారతాయి. Credit ratingపై ప్రభావం పడొచ్చు. Refinancing ఖర్చు పెరగొచ్చు. పరిస్థితి మరింత దిగజారితే default, restructuring, bankruptcy వంటి పరిణామాలు కూడా రావచ్చు. అప్పుడు నష్టపోయేది కేవలం AI కంపెనీ కాదు. ఆ bondలను కొన్న investors కూడా నష్టపోవచ్చు.
కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక financial loop. AI ఆదాయం వేగంగా పెరిగితే… ఈ loop విజయవంతమైన growth machine. AI ఆదాయం అంచనాలను అందుకోకపోతే… అదే loop అప్పుల ఉచ్చుగా మారొచ్చు.గోవిందా అనుకోవాల్సిందే.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








