కొత్త ట్రెండ్: చెత్త సినిమా… కానీ కలెక్షన్లు అదుర్స్!
ఒక సినిమా విడుదలైంది.
ట్రైలర్ లేదు. ప్రమోషన్ లేదు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లేదు. కనీసం సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. విడుదలైన మొదటి పది రోజుల్లో వచ్చిన కలెక్షన్ కేవలం 7,700 యువాన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు లక్ష రూపాయలకు సమానం. దేశం మొత్తం కలిపి టికెట్లు కొన్నవాళ్లు 300 మందికంటే తక్కువ.
అంతే. అక్కడితో ఆ సినిమా కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు సినిమా అప్పుడే మొదలైంది. చైనాలో ‘Niu Lai’ అనే ఈ 86 నిమిషాల యానిమేషన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారణం సినిమా బాగుండటం కాదు.
సినిమా చాలా చెత్తగా ఉండటమే.
ఒక ఆవు పిల్ల. ఒక స్కైలార్క్ పక్షి. వాళ్ల మధ్య ఏర్పడే సంబంధం. దాని చుట్టూ సాగే ఒక కలలాంటి కథ. ఇంతే.
అయితే యానిమేషన్ చూస్తే మాత్రం భారీ బడ్జెట్ సినిమాల ప్రపంచానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఖరీదైన కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు. అద్భుతమైన విజువల్స్ లేవు. హాలీవుడ్ స్థాయి యానిమేషన్ లేదు. అందుకే ప్రేక్షకులు దానిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.
“ఇంత చెత్తగా సినిమా ఎలా తీశారు?” అనే చర్చ మొదలైంది. అక్కడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఎగతాళి… పబ్లిసిటీగా మారింది.
సినిమా చూడాలని ఎవరూ మొదట అనుకోలేదు. కానీ సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూసి, “అసలు ఎంత చెత్తగా ఉంటుందో చూద్దాం” అంటూ థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు.
అలా లక్ష రూపాయల దగ్గర ఆగిపోయిన సినిమా ఇప్పుడు సుమారు ₹17 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే మొదట్లో ఎవరూ పట్టించుకోని సినిమా… ఒక్కసారిగా ఈ ఏడాది చైనాలో చెప్పుకోదగ్గ హిట్లలో ఒకటిగా మారిపోయింది.
ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఉంది. ఈ సినిమాను తయారు చేసింది పెద్ద యానిమేషన్ స్టూడియో కాదు. ఇద్దరు వ్యక్తులు. జిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే తల్లీకొడుకులు కలిసి దాదాపు ఐదేళ్ల పాటు ఈ సినిమాను రూపొందించారు. కథ రాశారు. దర్శకత్వం వహించారు. వాయిస్‌లు ఇచ్చారు. నిర్మించారు.
అంటే ఇది ఒక స్టూడియో ప్రొడక్ట్ కాదు. ఇద్దరు మనుషులు తమకు తోచినట్టు తయారు చేసిన సినిమా. అందుకే చైనీస్ సినీ పరిశ్రమలో కొందరికి ఇది అసలు అర్థం కావడం లేదు. ఒక పరిశ్రమ నిమిషానికి లక్షల డాలర్లు ఖర్చుపెట్టి యానిమేషన్‌ను మరింత రియలిస్టిక్‌గా, మరింత అందంగా, మరింత పరిపూర్ణంగా మార్చే ప్రయత్నం చేస్తుంటే… ఈ సినిమా మాత్రం ఆ మొత్తం ప్రయాణానికి ఎదురుగా నిలబడింది.
“అందంగా ఉండాల్సిన అవసరం ఏముంది?”
ఈ సినిమాకు మరో ఆసక్తికరమైన పొర కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం AI గురించి మాట్లాడుతోంది. AI సెకన్లలో చిత్రాలు సృష్టిస్తోంది. కొన్ని నిమిషాల్లో వీడియోలు తయారవుతున్నాయి. ఒకప్పుడు పెద్ద స్టూడియోకు అవసరమైన పని ఇప్పుడు ఒక కంప్యూటర్ చేయగలుగుతోంది. అలాంటి సమయంలో ఒక ప్రేక్షకుడు ఈ సినిమాలోని మానవ తప్పిదాలను కూడా ఒక రకమైన ప్రత్యేకతగా చూడటం మొదలుపెట్టాడు.
అక్కడి సోషల్ మీడియాలో లో ప్రేక్షకులు వేసిన ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. AI ఇంతగా ప్రాచుర్యం పొందుతున్న కాలంలో… ఈ సినిమా కావాలనే చేసినట్టుగా, ముడిగా కనిపించే విజువల్ స్టైల్‌ను ఎంచుకుందా? అది నిజంగా ఉద్దేశపూర్వక నిర్ణయమో కాదో తెలియదు.
ప్రతీది ఫెరఫెక్ట్ గా ఉండక్కర్లేదు
కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం ఒక విషయం చెబుతోంది. పర్ఫెక్షన్కు కూడా ఒక దశలో విసుగు వస్తుంది. ప్రతిదీ మెరుస్తూ ఉండాలి. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతీ క్యారెక్టర్ అందంగా ఉండాలి. ప్రతీ ఎఫెక్ట్ అద్భుతంగా ఉండాలి.
ఇలా సంవత్సరాలుగా సినిమాలు ప్రేక్షకులను అలవాటు చేశాయి. ఇప్పుడు AI వచ్చి ఆ పర్ఫెక్షన్ను మరింత సులభంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో ఒక ముడిగా ఉన్న, అసంపూర్ణమైన, విచిత్రమైన సినిమా ప్రేక్షకుడికి కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే అందులో మనిషి చేసిన పొరపాటు కనిపిస్తుంది. అది యంత్రం చేసిన పర్ఫెక్ట్ ఇమేజ్‌లా అనిపించదు.
మార్కెట్ లో కొత్త పాఠం
“ఇంత చెత్తగా ఉన్న సినిమా ఎలా ఉంటుంది?” అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చాలా మంది టికెట్ కొన్నారు. ఇదే ఇప్పుడు సినిమా మార్కెటింగ్‌లో మరో విచిత్రమైన పాఠం. కొన్నిసార్లు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకెళ్లేది సినిమా గొప్పతనం కాదు. సినిమా గురించి ఏర్పడిన ఆసక్తి. ‘Niu Lai’ విషయంలో నెగెటివ్ ప్రచారమే పాజిటివ్ బాక్సాఫీస్‌గా మారింది.
ఇదే సమయంలో చైనాలో మరో ప్రపంచం నడుస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘The Odyssey’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రం 192 మిలియన్ యువాన్లతో తన తొలి మూడు రోజుల్లోనే భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది. మరోవైపు చైనీస్ చిత్రం ‘Once Upon a Time in the Middle East’ అదే వారాంతంలో 477.9 మిలియన్ యువాన్లు వసూలు చేసి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఆ రెండు సినిమాల మధ్యలో…ఈ తల్లీకొడుకులు ఐదేళ్లలో చేసిన చిన్న యానిమేషన్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఎట్రాక్ట్ చేసింది. ఇది బాక్సాఫీస్ రికార్డు కథ కంటే పెద్ద విషయం. ఎందుకంటే ఇది మనకు సినిమా ప్రేక్షకుడి మనస్తత్వం గురించి చెబుతోంది.ప్రేక్షకుడు ఎప్పుడూ “ఏది బెస్ట్?” అని మాత్రమే వెతకడు.
కొన్నిసార్లు… “ఏది వింత?” అని కూడా వెతుకుతాడు. ఇంటర్నెట్ ఆ వింతను వైరల్ చేస్తుంది. మౌత్ టాక్ దాన్ని ఆసక్తిగా మారుస్తుంది. ఆ ఆసక్తి టికెట్‌గా మారుతుంది. టికెట్లు కలెక్షన్లుగా మారతాయి. అలా ఒక “చెత్త సినిమా” కూడా హిట్ అవుతుంది.
ఫైనల్ గా..
‘Niu Lai’ ఎంత గొప్ప సినిమా అన్నది కాదు ఇప్పుడు డిస్కషన్. AI పర్ఫెక్షన్ పెరుగుతున్న కొద్దీ… మనుషులు అసంపూర్ణత కోసం వెతకడం మొదలుపెడతారా? ఒకప్పుడు సినిమా ప్రేక్షకుడు అద్భుతమైన విజువల్స్ కోసం థియేటర్‌కు వెళ్లేవాడు. రేపు… “ఇది నిజంగా మనిషి చేశాడా?”అని తెలుసుకోవడానికి వెళ్లే రోజులు రావచ్చు. అప్పుడు అసంపూర్ణతే కొత్త పర్ఫెక్షన్ కావచ్చు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








