తానా ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని , భారతీయ-అమెరికన్ సమాజం మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తానా మరోసారి తన సంప్రదాయాన్ని చాటుకుంది. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) బృందం అత్యంత ఉత్సాహంగా, గర్వంగా పాలుపంచుకుంది.
తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి పర్యవేక్షణలో సాగిన ఈ వేడుకల్లో, తానా నాయకులు, వివిధ ప్రాంతీయ ప్రతినిధులు, బోర్డు ట్రస్టీలు అలాగే అనేక మంది వాలంటీర్లు కలిసి నడిచారు. పరేడ్ పొడవునా అక్కడకు చేరుకున్న తెలుగు సంఘాలు , ఇతర పరేడ్ వీక్షకుల నుంచి తానా బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రవాస కుటుంబాలు తానా సభ్యులను అభినందించడమే కాకుండా, రాబోయే వేడుకల్లో తాము కూడా భాగస్వామ్యం కావాలనే ఆసక్తిని వెలిబుచ్చారు.
పరేడ్ సాగుతున్నంత సేపు చాలామంది స్థానిక సభ్యులు తానా అందిస్తున్న సామాజిక సేవలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, వాలంటీర్ అవకాశాలపై ఆరా తీశారు. అమెరికా వ్యాప్తంగా తానా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు , సంస్థ చేపడుతున్న విభిన్న సేవల గురించి తానా ప్రతినిధులు వారికి వివరంగా తెలియజేశారు.
ఈ చారిత్రక పరేడ్‌కు భారత్ నుంచి విచ్చేసిన ప్రముఖ సినీ తారలు పూజా హెగ్డే , అడివి శేష్ గ్రాండ్ మార్షల్స్గా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో తానా తరఫున న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి మౌనికా మానికొండ, న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భక్తవరపు, ట్రస్టీ శ్రీనివాస్ యెండూరి, పాఠశాల సహ-అధ్యక్షుడు రావు యలమంచిలి, అంతర్జాతీయ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లితో పాటు చందన, కృష్ణ, వాసు రెడ్డి, స్వాతి కుచిబోట్ల, గణేష్ మూర్తి తదితర అంకితభావం గల వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారు.
భారతీయ-అమెరికన్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి, మన దేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని భావితరాలకు పరిచయం చేయడానికి ఇటువంటి పరేడ్లు ఎంతగానో దోహదపడతాయని తానా ప్రతినిధులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్క నాయకుడికి, వాలంటీర్‌కు, , మద్దతుదారులందరికీ తానా యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. తెలుగు సమాజానికి అంకితభావంతో సేవ చేస్తూ, భారతీయ సంస్కృతిని అమెరికా గడ్డపై మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తానా ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది.








