సిలికానాంధ్ర రజతోత్సవం అద్భుతం.. గిన్నిస్ రికార్డుల హోరు
సిలికానాంధ్ర తన 25 సంవత్సరాలు వేడుకను విభిన్నంగా చేయడంతోపాటు గిన్నిస్ రికార్డులను సృష్టించడం విశేషం. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద కూచిభొట్ల, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులతోపాటు సిలికానాంధ్ర టీమ్, వలంటీర్లు ఎంతో శ్రమించి ఈ వేడుకను అద్భుతంగా దిగ్విజయం చేశారు.
గిన్నీస్ రికార్డు సృష్టించిన సంగీతామృతవర్షిణి
కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ ఎరీనా వేదికగా ‘సిలికానాంధ్ర’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతీసంప్రదాయాల వికాసానికి గత 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ, తన పాతికేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే కుటుంబంగా అనుసంధానిస్తూ, భావితరాలకు మన సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు సాగాయి. సిలికానాంధ్ర అంటే తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల వేదిక అని గత 25 ఏళ్లుగా వారు చేసిన పనులన్నీ చెబుతూనే ఉన్నాయి. అలాంటి సిలికానాంధ్ర అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంఘాల కంటే భిన్నంగా తన 25 సంవత్సరాలు వేడుక ఏ విధంగా చేస్తుంది అని చాలామంది ఎదురుచూశారు కూడా. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆనంద కూచిభోట్ల కూడా సిలికానాంధ్ర విభిన్నతను చాటేలా రజతోత్సవాలను నిర్వహించడంతోపాటు గిన్నిస్ రికార్డుల్లో కూడా ఈ రజతోత్సవాలు ఎక్కేలా చేశారు. 3 గిన్నిస్ రికార్డులను ఈ రజతోత్సవ వేడుకల్లో సాధించడం విశేషం.
ఈ వేడుకల్లో భాగంగా తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కుంభ హారతి, సంగీత, లయ సవ్వడులు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, లలిత గీతాలు, శతక పద్యాల ఆలాపన , జానపద కళారూపాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.య అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రవాస తెలుగువారితో ఈ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది.
ఒకవైపు ఆ వేడుకకు పచ్చని తోరణాలుగా స్ఫూర్తినిచ్చిన గురువరేణ్యలకు, మహా దాతలకు సత్కారాలు! ఇంకో వైపు వచ్చినవారికి అరటి ఆకులో అచ్చమైన సాంప్రదాయ తెలుగు వారి విందు వైభవాన్ని కలిగించి వేడుకలను నిర్వహించడంలో సిలికానాంధ్ర భిన్నంగా ఉంటుందని మరోసారి చాటిచెప్పింది. వచ్చిన అతిధులను, గురువులను సత్కరించే శాలువాలను కూడా భిన్నమైన రూపంలో, రంగులో తయారు చేయించి అందులో కూడా తన విభిన్నతను సిలికానాంధ్ర చాటుకుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి అతి పురాతన కాడ ఒగ్గు కథ చెప్పడానికి మిద్దె రాములుగారి మనవడు మిద్దె పరశురామ్ అమెరికా కు వచ్చి బృందంతో ఒగ్గు కథ చెప్పారు. అమెరికాలో వివిధ నగరాల్లో నివసిస్తూ శాస్త్రీయ నాట్యం, సంగీతం నేర్పిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురువులను ఈ సందర్భంగా సత్కరించడం విశేషం. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు డాక్టర్ ఆనంద్ కూచిభోట్ల స్వయంగా ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ ఈ వేడుకకు పిల్లర్స్ గా నిలిచిన దాతలను వారి కుటుంబాలను సత్కరించుకున్నారు. ఈ రజతోత్సవ వేడుకల్లో వివిధ కళా ప్రదర్శనలకు గురువులుగా నిలిచిన ప్రముఖ గురువులను సిలికానాంధ్ర అధ్యక్షురాలు ప్రియ తనుగుల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ వేడుకలకు అతిదులుగా బిజెపి సీనియర్ నేత కె. మురళీధరరావు, అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి, పూర్వ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ పూర్వ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ కవి, రచయిత జొన్నవిత్తుల తదితరులు హాజరయ్యారు.
సంప్రదాయ అరిటాకు భోజనం
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ సంస్థలు ఆర్భాటంగా వేడుకలను నిర్వహిస్తూ, తొలిరోజు బాంక్వెట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంటాయి. అంటే ఆ వేడుకల్లో పాల్గొనే అతిధులను, దాతలను సత్కరించుకునే ముందస్తు కార్యక్రమమే బాంక్వెట్ డిన్నర్. కాగా ఈ డిన్నర్ లో బఫే భోజనమే మనకు కనిపిస్తుంటుంది. అందరూ చేతిలో ప్లేట్స్ పెట్టుకుని వడ్డించేవాడి దగ్గరకు వెళ్ళి తమకు కావాల్సినవి వేసుకుంటారు. కాని సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకల్లో జరిగిన బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం అచ్చ తెలుగు విందు భోజనాన్ని తలపించింది. వేడివేడి పకోడీలతోపాటు షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వచ్చినవారిని కూర్చోపెట్టి అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం విశేషంగా చెప్పవచ్చు. ఏదీ ఏమైనా వేలాదిమందికి చక్కగా అరిటాకు భోజనం పెట్టి తెలుగువారి స్వాగత సత్కారాలకు చిరునామాగా మరోసారి సిలికానాంధ్ర నిరూపించుకుంది.
పాల్గొన్న సంగీత దిగ్గజాలు…
భారతదేశం నుంచి ప్రఖ్యాత సంగీత దిగ్గజాలు ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన విద్వాంసులు, సంగీత కళానిధి డాక్టర్ త్రిచి శంకరన్, ప్రఖ్యాత కర్ణాటక గాయకుడు, కంపోజర్, ఆర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ విద్వాన్ కేఎన్ శశికిరణ్, మృదంగ నాదమణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత విద్వాన్ పత్రి సతీష్ కుమార్, కర్ణాటక సంగీత దిగ్గజం, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ‘కళైమామణి’ తిరువారూర్ వైద్యనాథన్, ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విదుషి సుధా రఘునాథన్తోపాటు యువ గాయనీ గాయకులు ఎందరో ఇందులో పాల్గొన్నారు.
సంగీతామృత వర్షిణి..
14వ శతాబ్దం నాటి తెలుగు వాగ్గేయకారులు అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులతోపాటు బాల మురళీకృష్ణ లు రచించిన లేదా రచించి పాడిన, లేదా పాడిన స్వరాలను అమెరికాలోని శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు, పెద్దవాళ్ళందరినీ కలిపి ఒకచోట చేర్చి వారి చేత ఈ పాటలను పాడించాలన్న ఆలోచన నుంచి పుట్టింది సంగీతామృత వర్షిణి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చిన అధికారి మిస్టర్ మైకేల్ , ఆయన బృందం ఓక్లాండ్ ఎరీనా లో లైన్ లైన్ తిరుగుతూ మనిషి మనిషిని కౌంట్ చేసుకుంటూ ఉండటం ప్రత్యక్షంగా కనిపించింది. ఫైనల్ గా 996 మంది శాస్త్రీయ సంగీత గాయకులు కలిసి సంగీతామృతాన్ని కురిపించారు. ఆ తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మైఖేల్ స్టేజ్ మీదకు వచ్చి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓక్లాండ్ స్టేడియంలో 996 మంది కలిసి ఈ విధంగా ఒకేసారి పాడటం ఒక రికార్డుగా డిక్లేర్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్లకు, ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియ తనుగులకు అందజేశారు.
శతక శంఖారావం మరో గిన్నిస్ రికార్డు
సిలికానాంధ్ర రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన శతక శంఖారావం కార్యక్రమం కూడా గిన్నిస్ రికార్డును సాధించింది.
మనందరికీ చిన్నప్పుడు తెలుగులో నేర్చుకున్న సుమతి శతకం, వేమన శతకం లోని పద్యాలు గుర్తు ఉండే ఉంటాయి అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు నేర్పించాలన్న ఉద్దేశంతో 2007లో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి 2026కి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ పిల్లలకి వారి తల్లితండ్రులు కూడా పాల్గొనేలా చేసిన కార్యక్రమమే శతక శంఖారావం. ఈ సందర్భంగా సుమతి, వేమన శతకాలలోని పద్యాలను చెప్పడమే ఈ కార్యక్రమం. రజతోత్సవ వేడుకలు నిర్వహించిన ఓక్లాండ్ ఏరీనాలో 1712 మంది కూర్చుని 18 పద్యాలను లయబద్ధంగా చూడకుండా చెప్పటమే శతక శంఖారావం. ఈసారి కూడా గిన్నిస్ అధికారి మైఖేల్ స్టేజ్ మీదకు వచ్చి 1712 మంది 18 పద్యాలను చెప్పడం ఇది ఒక రికార్డు అని ప్రకటించారు సిలికాన్ ఆంధ్ర కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు, మనబడి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇందులో పెద్దఎత్తున పాల్గొనడం విశేషం.
అహో అనిపించిన దక్ష యజ్ఞం
సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఓక్లాండ్ ఎరీనా స్టేడియంలో ఈ మహా అద్భుతం జరిగింది. పౌరాణిక నాటకాలను ప్రోత్సహించే సిలికానాంధ్ర సంస్థ ఈసారి ఈ ప్రయోగ నాటకం ప్రదర్శించి సంచలన రికార్డు సృష్టించింది. ఏడు వేలకు మందికి పైగా ప్రేక్షకులు ఈ నాటకాన్ని తిలకించడం విశేషం! ఈ రోజుల్లో ఒక నాటక ప్రదర్శన చూసేందుకు ఐదారు వందల మంది వస్తే గొప్ప! కానీ, అమెరికాలో ప్రదర్శించిన దక్ష యజ్ఞం నాటకాన్ని ప్రత్యక్షంగా ఏడు వేల మంది, పరోక్షంగా లక్షల మంది తిలకించారు. ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మొత్తం 120 మంది కళాకారులు దక్ష యజ్ఞంలో వివిధ పాత్రలు పోషించారు. తెర వెనుక మరో 32 మంది శ్రమించి రక్తి కట్టించారు. ఈ సాహసానికి చిరునామా మరెవరో కాదు… శ్రీ దిలీప్ కొండిపర్తి! సిలికానాంధ్ర పూర్వ అధ్యక్షులు! సృజనాత్మక శక్తి ఆయన! నాటకంలో ఆయా పాత్రలు పోషించింది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కారు. కొందరు టెకీలు, మరికొందరు విద్యార్థులు! ఆడిషన్ పెట్టి కళాకారులను ఎంపిక చేసుకుని మూడు నెలల పాటు వీకెండ్స్ లో రిహార్సల్స్ చేసుకుని స్టేడియం మొత్తం వేదికగా మార్చుకుని ప్రేక్షకులను కట్టి పడేసారు. అట్లాంటా ప్రశాంత్, డాలస్ ప్రసన్న, హైదరాబాద్ కు చెందిన మిమిక్రి జనార్దన్, ఫణి మాధవ్ తదితరులు అందించిన డిజిటల్ శక్తియుక్తుల నైపుణ్యం, రంగోద్దీపనం ఈ నాటకానికి ప్రాణం పోశాయి.
అద్భుతమైన సంగీతంతో సమకూర్చిన పాటలు, ఆ పాటలకు తగిన డిజిటల్ క్రియేషన్ ఆద్యంతం హుషారెత్తించింది! ఇంతటి మహా నాటకానికి కర్త కర్మ క్రియ అన్నీ దిలీప్ కొండిపర్తి గారే! కాన్సెప్ట్, రీసెర్చ్, దర్శకత్వంతో పాటు సంగీతం కూడా ఆయనే అందించారు. గుర్రాలు, బగ్గిలు, స్తంభాలు, రాజకోటలు, యుద్ధాలు, యజ్ఞ గుండాలు భారీ సెట్టింగులతో ప్రదర్శించిన ఈ నాటకం నిడివి గంట మాత్రమే! రామచంద్రరావు తల్లాప్రగడ రచించిన ఈ నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది. శివుడి రుద్ర తాండవం, వీరభద్రుడు, దక్షుడి యుద్ధ ఘట్టం హైలెట్ గా నిలిచింది. స్టేడియం వేదిక కావడం ఒక రికార్డు అయితే, ఇంతటి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం, పాటలు సమకూర్చడం, సంగీతంతో పాటు వేలాది ప్రేక్షకులు నాటకం చూడటం వరకు అన్నీ రికార్డులే! ఎవ్వరు చేయని సాహసాలే అని ఆయన అన్నారు.
సిలికానాంధ్ర 25 ఏళ్ళ ప్రయాణం…
పాతికేళ్ళ క్రితం ఒక చిన్న విత్తనం నాటబడింది. 2001, ఆగస్టు 4న లివర్ మోర్ శివ విష్ణు ఆలయంలో, గరికిపాటి నరసింహారావు చారిత్రాత్మక అష్టావధానం సమక్షంలో మన సిలికానాంధ్ర ప్రయాణం ప్రారంభమైంది. నేడు, మన రజతోత్సవ కాంతిలో నిలబడి చూస్తే… ఆనాడు నాటిన ఒకే ఒక్క విత్తనం నేడు ఖండాంతరాల పొడవునా విస్తరించింది. మన సమృద్ధియైన భారతీయ సంస్కృతి, తెలుగు భాష మరియు సాంప్రదాయాల అమృత ఫలాలను భావితరాలకు అందించే ఒక విశ్వసనీయ నిలయంగా ఇది రూపుదిద్దుకుంది.
సిలికానాంధ్ర అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు; అదొక ప్రపంచ కుటుంబం, ఒక పవిత్ర సిద్ధాంతం మరియు అచంచలమైన దార్శనికతతో నడిచే ఒక ఉద్యమం. ఉన్నతమైన ఆలోచనలు, మన పరిమితులను దాటే సంకల్పమే మన అసలైన పునాది. “వసుదైవ కుటుంబకం” అనే పవిత్రమైన తత్త్వంతో మనం ముడిపడి ఉన్నాం. ఈ ప్రగతిశీల ఆలోచనే మన అతిపెద్ద ఆస్తి. సరిహద్దులను చెరిపివేయడానికి, మన మాతృభాషను గౌరవించుకోవడానికి మరియు ఈ రజతోత్సవ వేడుకల్లో సాధించిన 3 చారిత్రాత్మక మైలురాళ్లతో సహా డజనుకు పైగా (చివరి గణన ప్రకారం 13) గిన్నిస్ ప్రపంచ రికార్డులను గర్వంగా సొంతం చేసుకోవడానికి ఈ నిరంతర జ్వాలే మనకు బలాన్నిచ్చిందని సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల పేర్కొన్నారు.
ఆక్లాండ్ అరేనాలో జరిగిన భారీ సమూహంతో సహా సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు సాధించిన అపూర్వమైన, సువర్ణాక్షర విజయం ఒకే విషయాన్ని నిరూపిస్తోంది… మీ మూలాలు, సంస్కృతి మరియు విలువలపై మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, మీరు ప్రయోజనకరమైన లక్ష్యంతో మాట్లాడినప్పుడు ఈ ప్రపంచమంతా నిలబడి వింటుంది. ఈ విజయం మీ అందరిది. వేదికలను వెలిగించిన సాంకేతిక నిపుణుల నుండి, కేవలం నిష్కల్మషమైన అంకితభావం మరియు కర్తవ్యనిష్ఠతో పనిచేసిన ప్రతి ఒక్క అద్భుతమైన స్వచ్ఛంద సేవకుడి వరకు… ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన బాధ్యతలను భుజానకెత్తుకొని, మనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండే తదుపరి తరం నాయకులను అన్వేషించి, తీర్చిదిద్దడమే మన అంతిమ లక్ష్యం. మన సంస్కృతి అనే సరస్సులో తెలుగు భాషా కమలాలు వికసిస్తూనే ఉంటాయి. సిలికానాంధ్రను ఒక నిజమైన గ్లోబల్ కుటుంబంగా మార్చినందుకు అందరికీ ధన్యవాదాలని ఆనంద్ కూచిభొట్ల చెప్పారు.








