భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్: సైబరాబాద్‌లో భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), హైదరాబాద్ సీ అండ్ డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి గౌలిదొడ్డిలో ఏర్పాటు చేసిన తొలి ప్రత్యేక సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని(C&D Waste Private Limited) ప్రారంభించింది.
మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్, ఐఏఎస్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఐఏఎస్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శ్రీ జయేశ్ రంజన్, ఐఏఎస్ మాట్లాడుతూ, “మన రోడ్లు, జలాశయాలు మరియు ఖాళీ స్థలాలను కాపాడుకోవడానికి భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. గౌలిదొడ్డి వద్ద ఏర్పాటు చేసిన ఈ సరికొత్త వ్యర్థాల బదిలీ కేంద్రం (ట్రాన్స్ఫర్ స్టేషన్) ద్వారా ఇటువంటి వ్యర్థాలను సేకరించి, అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఒక క్రమబద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం సుస్థిర పట్టణాభివృద్ధిని మరింత బలోపేతం చేయడంతో పాటు, సైబరాబాద్ ప్రాంతంలో పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది” అని పేర్కొన్నారు.
భవన నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారికి ఈ కొత్త కేంద్రం తీసుకువచ్చే సౌలభ్యాన్ని, అందుబాటును వివరిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి.సృజన, ఐఏఎస్ మాట్లాడుతూ…. “గౌలిదొడ్డి వ్యర్థాల బదిలీ కేంద్రం ద్వారా బిల్డర్లు, నగరవాసులు తమ నిర్మాణ వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారబోయడం మరింత సులభతరం అవుతుంది. తక్కువ పరిమాణంలో ఉండే వ్యర్థాల కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రీజనబుల్ ఛార్జీలతో ఆన్-డిమాండ్ కలెక్షన్ సేవలను కూడా అందిస్తుంది. పౌరులు, బిల్డర్లు అందరూ ఈ అధికారిక వ్యవస్థను ఉపయోగించుకోవాలని, రోడ్ల పక్కన, చెరువుల సమీపంలో లేదా ఖాళీ స్థలాల్లో వ్యర్థాలను పారబోయవద్దని కోరుతున్నాం. ఎక్కడపడితే అక్కడ అక్రమంగా చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంపై రీ (Re) సంస్థ, సర్క్యులర్ ఎకానమీ, బిజినెస్ హెడ్, కృష్ణ తోట మాట్లాడుతూ, “నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు సమీపంలోనే క్రమబద్ధమైన సేకరణ మౌలిక వసతులను అందుబాటులోకి తేవడంతోనే సమర్థవంతమైన సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణ మొదలవుతుంది. కచ్చితమైన తూకం, డిజిటల్ రికార్డులు మరియు పారదర్శక పర్యవేక్షణతో పనిచేసే గౌలిదొడ్డి కేంద్రం.. వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారికి మరియు అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు మధ్య కీలక వారధిగా నిలుస్తుంది. అక్రమ డంపింగ్‌ను అడ్డుకోవడం, వ్యర్థాల నుంచి వనరులను పునరుద్ధరించడం మరియు నిర్మాణ రంగంలో వ్యర్థాల పునర్వినియోగాన్ని (సర్క్యులారిటీ) ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఒక నమ్మకమైన, విస్తృతమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం” అని పేర్కొన్నారు.
ఈ కేంద్రం కొండాపూర్, మసీద్ బండ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, మణికొండ, నల్లగండ్ల మరియు శేరిలింగంపల్లి ప్రాంతాలకు సేవలందిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లు మరియు పౌరులు తమ నిర్మాణ వ్యర్థాలను నిర్దేశిత స్థలంలో సులభంగా వేయడానికి ఇది అందుబాటులోకి వచ్చింది.
ప్రణాళికలోని నాలుగు సేకరణ కేంద్రాల్లో మొదటిది ఇదే..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని భావించిన నాలుగు సీ అండ్ డీ వ్యర్థాల బదిలీ కేంద్రాలలో (ట్రాన్స్ఫర్ స్టేషన్లు) ఈ గౌలిదొడ్డి కేంద్రం మొదటిది. వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు సమీపంలోనే క్రమబద్ధమైన, సులభంగా అందుబాటులో ఉండే సేకరణ వ్యవస్థను తీసుకురావడం ద్వారా నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పారబోయడాన్ని అడ్డుకోవడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.
ఈ వికేంద్రీకృత విధానం నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారికి మరియు అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారబోయడం మరింత సులభతరం కావడమే కాకుండా, వ్యర్థాల సేకరణ మరియు రవాణా సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.
సాంకేతిక ఆధారిత, పారదర్శక సేవలు
కేంద్రానికి వచ్చే నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల పరిమాణాన్ని కచ్చితంగా కొలిచి నమోదు చేసేందుకు వీలుగా, పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ వేబ్రిడ్జ్ మరియు డేటా రికార్డింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. వేబ్రిడ్జ్‌పై నమోదైన అసలు బరువు ఆధారంగానే వ్యర్థాలను తీసుకొచ్చిన వారు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వ్యర్థాల సేకరణ మరియు బిల్లింగ్ విధానంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడుతుంది.
అలాగే ఈ కేంద్రం నిరంతరం సీసీటీవీ నిఘా నీడలో పనిచేస్తుంది. ఇది నిర్వహణ పర్యవేక్షణ, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
ఇలా సేకరించిన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను తగిన రీతిలో ప్రాసెసింగ్ చేయడానికి, వాటి నుంచి తిరిగి ఉపయోగపడే వనరులను పునరుద్ధరించడానికి అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఇది నిర్మాణ వ్యర్థాలను అనధికారిక ప్రాంతాల్లో పారబోయకుండా అడ్డుకోవడంతో పాటు, నిర్మాణ రంగ వ్యర్థాల నిర్వహణలో సమగ్ర పునర్వినియోగ(సర్క్యులర్) విధానానికి ఎంతగానో దోహదపడుతుంది.
తక్కువ పరిమాణంలో ఉండే నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రీజనబుల్ ఛార్జీలతో ‘ఆన్-డిమాండ్ కలెక్షన్’ సేవలను కూడా అందిస్తుంది. దీనివల్ల సాధారణ పౌరులు, చిన్న మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారికి కూడా ఈ అధికారిక వ్యవస్థ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుంది.
వ్యవస్థీకృత సీ అండ్ డీ వ్యర్థాల వ్యవస్థ ఏర్పాటు
నగరాల వేగవంతమైన విస్తరణ మరియు విస్తృత నిర్మాణ కార్యకలాపాల వల్ల కాంక్రీట్, ఇటుకలు, రాతి కట్టడాల శకలాలు, మట్టి మరియు ఇతర నిర్మాణ వ్యర్థాలు భారీ పరిమాణంలో పోగుపడుతున్నాయి. సులభంగా అందుబాటులో ఉండే సేకరణ వ్యవస్థ లేకపోతే, ఆ వ్యర్థాలు రోడ్ల పక్కన, జలాశయాల సమీపంలో, ఖాళీ స్థలాల్లో మరియు ఇతర అనధికారిక ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
కీలక ప్రాంతాల్లో ఈ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సీఎంసీ, రీ(Re) సంస్థలు వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ మరియు వనరుల పునరుద్ధరణను అనుసంధానించే ఒక నిర్మాణాత్మక మార్గాన్ని తీర్చిదిద్దుతున్నాయి.
సీఎంసీ పరిధిలో మరో మూడు బదిలీ కేంద్రాలను (ట్రాన్స్ఫర్ స్టేషన్లు) ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తుండటంతో, ఈ కార్యక్రమం ద్వారా సైబరాబాద్ అంతటా క్రమబద్ధమైన సీ అండ్ డీ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ దశలవారీగా మరింత విస్తరించనుంది. తద్వారా బహిరంగ ప్రదేశాలు మరింత పరిశుభ్రంగా మారడంతో పాటు సుస్థిర నగరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.








