22A Lands: 22ఏ భూముల వివాదంపై ప్రభుత్వం దిద్దుబాటు!
తెలంగాణలో గత కొంతకాలంగా తీవ్ర దుమారం రేపుతున్న రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితాలోని సెక్షన్ 22ఏ భూముల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ధరణి పోర్టల్ లోపాలు, 22ఏ కింద అమాయక రైతులు, సామాన్య ప్రజల భూములను చేర్చి వేధిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 22ఏ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని భూ సమస్యల తీవ్రత దృష్ట్యా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్-రిజిస్ట్రార్ అధికారులు పాల్గొన్నారు. సబ్-రిజిస్ట్రార్ వారీగా 22-ఏ పరిధిలో ఉన్న భూముల వివరాలను మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు. అసలు ఏయే ప్రాంతాల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అవి ఎప్పుడు వచ్చాయి? ఇప్పటివరకు ఎందుకు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి? అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టమైన గడువు ఇవ్వాలని ఆదేశించారు.
చిన్న సమస్యను పరిష్కరించకుండా పెద్ద సమస్యగా మార్చొద్దని అధికారులకు మంత్రి సూచించారు. అర్జీలు పెట్టుకున్న ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ, కావాలని జాప్యం చేసే ధోరణిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఒక భూమిని 22-ఏ జాబితాలో ఎందుకు చేర్చారు? సంబంధిత రికార్డులు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. 22-ఏ జాబితాలో ఉందనే ఒకే ఒక్క కారణంతో ప్రజల దరఖాస్తులను తిరస్కరించడం తగదని తేల్చిచెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి విధానం కారణంగా లక్షలాది ఎకరాల భూములు 22-ఏ పరిధిలోకి వెళ్లి రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే, తాజా పాలనలోనూ సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదంటూ బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై రాజకీయ విమర్శల దాడిని ముమ్మరం చేశాయి. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట కాలయాపన చేస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ సమీక్ష ద్వారా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ, నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయడం రెండూ ప్రభుత్వానికి సమానమేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూనే, అసలైన హక్కుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులకు తేల్చిచెప్పారు. ప్రజల సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి వచ్చేలా, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. నిబంధనల పేరుతో వ్యవస్థలను స్తంభింపజేయకుండా పారదర్శకంగా, వేగంగా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన తేల్చిచెప్పారు.








