ఎమ్మెల్సీ సమరం.. బీజేపీలో టికెట్ల లొల్లి!!
గతేడాది ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు నమోదు చేసి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లకు గట్టి ఝలక్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ.. రాబోయే ఎమ్మెల్సీ పోరుకు సిద్ధమవుతోంది. నల్గొండ–వరంగల్–ఖమ్మం, మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతోంది. అయితే ఎన్నికల వ్యూహాల కంటే ముందే పార్టీలో టికెట్ల లొల్లి, అంతర్గత కుమ్ములాటలు తెరపైకి రావడం కాషాయ శిబిరంలో కాకరేపుతోంది.
గత ఏడాది కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి చింతపండు అంజిరెడ్డి, అలాగే మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి ఎం. కొమరయ్య ఘన విజయం సాధించి పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే, ఆ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచే మొదలైన అంతర్గత అసంతృప్తి ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ పోరులో మరింత తీవ్రరూపం దాలుస్తోంది. పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యమివ్వాలా లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన తాజా నేతలకు అవకాశం కల్పించాలా? స్థానిక నేతలకు ఇవ్వాలా లేక బయటి వ్యక్తులను రంగంలోకి దించాలా? అన్న రెండు ప్రధాన ప్రశ్నలు నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణాలు, పట్టణ విద్యావంతులే బీజేపీకి ప్రధాన బలం. ప్రస్తుతం ఇక్కడ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి 2021లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాన్ని గతంలో అంటే 2015లో నాటి బీఆర్ఎస్ హవాలోనూ గెలుచుకున్న ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.. ఆ తర్వాతి ఎన్నికల్లో వాణీదేవి చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.
ఈసారి ఇక్కడి నుంచి పీవీ నరసింహారావు మనవడు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అమెరికాలో పీజీ ఇంజనీరింగ్ చదివిన విద్యావంతుడిగా, పార్టీ సంస్థాగత బలోపేతానికి పనిచేసిన నాయకుడిగా ఆయన తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఎస్. మల్లా రెడ్డి కూడా ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న విధేయుడిగా తనకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే, సమీకరణాలు మారితే స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావే మళ్లీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని లేదా అనూహ్యంగా మరొకరి పేరు తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలోనూ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నాయకులు ఎస్. ప్రకాశ్ రెడ్డి, జి. మనోహర్ రెడ్డి, జి. ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు టికెట్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావులతో కూడిన కమిటీ అభ్యర్థుల పేర్లను పరిశీలించి హైకమాండ్ ఆమోదానికి పంపనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ, గ్రూపు రాజకీయాలు, లాబీయింగ్ అధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నికలకు ప్రతిసారీ ఓటర్ల నమోదు కొత్తగా జరగాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించడమే తమ ప్రధాన వ్యూహమని పార్టీ భావిస్తోంది. విద్యార్థి ఉద్యమాలు తమ గెలుపుపై ప్రభావం చూపబోవని నాయకత్వం ధీమాగా ఉన్నప్పటికీ, అంతర్గత అసమ్మతిని చక్కదిద్ది, బలమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను అధిగమించి కాషాయ జెండాను ఎగరేయడం బీజేపీకి నిజమైన సవాలే.








