ట్రంప్‌పై కోర్టుకెక్కిన డిస్నీ.. అసలేం జరిగింది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
డిస్నీ అంటే పిల్లల కార్టూన్లు, సినిమాలు, డిస్నీల్యాండ్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అదే డిస్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా ఢీకొంటోంది. కారణం.. మీడియా స్వేచ్ఛ.
గత కొంతకాలంగా డిస్నీకి చెందిన ABC నెట్‌వర్క్‌పై అమెరికా ప్రభుత్వం, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) చర్యలు తీసుకుంటోంది. ABC రాజకీయ కవరేజీపై ట్రంప్, FCC చైర్మన్ బ్రెండన్ కార్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పరిస్థితి మరింత ముదిరింది.
ఈ క్రమంలో డిస్నీ, ABC, ABCకి చెందిన ఎనిమిది స్టేషన్లు కలిసి FCCపై ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. డిస్నీ ఏమంటోంది అంటే.. “మా వార్తలు మీకు నచ్చలేదని.. మా టీవీ లైసెన్సులను ఉపయోగించి మమ్మల్ని బెదిరించలేరు.” అని. ఇక్కడి నుంచే అసలు ట్రంప్ vs డిస్నీ పోరాటం మొదలైంది.
ట్రంప్‌కు ABCపై ఎందుకు కోపం?
డిస్నీకు చెందిన ABCలో ప్రసారమయ్యే కొన్ని రాజకీయ కార్యక్రమాలు, ముఖ్యంగా The View, ట్రంప్‌పై విమర్శలు చేస్తుంటాయి. Jimmy Kimmel Live! కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండే వ్యాఖ్యలకు ప్రసిద్ధి. ఇవి ట్రంప్‌కు చాలాసార్లు ఆగ్రహం తెప్పించాయి.
ట్రంప్, FCC చైర్మన్ బ్రెండన్ కార్ కూడా ABC రాజకీయ కవరేజీపై బహిరంగంగా విమర్శలు చేశారు. కొన్ని సందర్భాల్లో ABC స్టేషన్ల బ్రాడ్కాస్ట్ లైసెన్సులపైనా చర్యలు తీసుకోవచ్చనే హెచ్చరికలు వచ్చాయి.
ఇక్కడే డిస్నీకి అసలు భయం మొదలైంది. ఎందుకంటే అమెరికాలో టీవీ బ్రాడ్కాస్ట్ స్టేషన్లకు FCC లైసెన్సులు అవసరం. ఆ లైసెన్సులను రెన్యూవల్ చేయడం, నియంత్రించడం FCC చేతిలో ఉంటుంది.
దాంతో ట్రంప్ ప్రభుత్వానికి నచ్చని వార్తలు ప్రసారం చేస్తే.. అదే లైసెన్స్‌ను ఆ ఛానెల్ పై ప్రెజర్ తీసుకురావటానికి ఆయుధంగా ఉపయోగించగలరా? అని డిస్నీ ప్రశ్నిస్తోంది.
లైసెన్స్‌ను ఎందుకు ముందుగానే రెన్యూవల్ చేయమన్నారు?
ఇదే వివాదానికి ప్రధాన కారణం. ABCకి చెందిన ఎనిమిది ప్రాంతీయ స్టేషన్ల లైసెన్సులు ఇంకా కొన్ని సంవత్సరాలు చెల్లుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌లో FCC వాటిని ముందుగానే రెన్యూవల్ చేసుకోవాలని కోరింది.
FCC దీనికి వేరే కారణాలు చెప్పింది. కానీ డిస్నీ మాత్రం ఇది తమ రాజకీయ కవరేజీపై జరుగుతున్న ఒత్తిడిలో భాగమని ఆరోపిస్తోంది. అంతేకాదు.. ABCకి మద్దతుగా ప్రజల నుంచి 1.5 లక్షలకు పైగా కామెంట్లు FCCకి వచ్చాయి.
అయినా వివాదం ఆగలేదు. చివరకు డిస్నీకి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ ప్రభుత్వానికి లొంగిపోవాలా? లేక కోర్టులో పోరాడాలా? డిస్నీ రెండో దారిని ఎంచుకుంది.
అసలు ఎక్కడ మొదలైంది?
ఈ గొడవ ఒక్క రోజులో మొదలైనది కాదు. జిమ్మీ కిమ్మెల్ కార్యక్రమంపై గతంలో జరిగిన వివాదం కూడా డిస్నీకి పెద్ద పరీక్షగా మారింది. కిమ్మెల్ చేసిన ఒక వ్యాఖ్యపై వివాదం చెలరేగింది. కొన్ని ABC అనుబంధ స్టేషన్లు అతని కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా అడ్డుకున్నాయి. ఆ సమయంలో FCC చైర్మన్ కార్ కూడా కిమ్మెల్పై విమర్శలు చేశారు.
డిస్నీ కూడా కొంతకాలం కార్యక్రమాన్ని నిలిపివేసింది. కానీ అమెరికాలో భారీ వ్యతిరేకత వచ్చింది. ప్రేక్షకులు డిస్నీకి చెందిన సేవలను, థీమ్ పార్కులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. చివరికి కిమ్మెల్ మళ్లీ ప్రసారంలోకి వచ్చాడు.
ఆ సంఘటన తర్వాత డిస్నీకి ఒక విషయం అర్థమైందని చెప్పాలి ప్రభుత్వ ఒత్తిడికి భయపడి వెనక్కి తగ్గితే.. ప్రేక్షకుల నుంచి కూడా భారీ ప్రతిస్పందన రావచ్చు.
ఇప్పుడు డిస్నీ ఎందుకు గట్టిగా నిలబడింది?
ఇటీవల డిస్నీ తన వైఖరిని మార్చినట్లు కనిపిస్తోంది. ABC తన లైసెన్సులను ముందుగానే రెన్యూవల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసినా.. అది “నిరసన కింద” చేస్తున్నామని స్పష్టం చేసింది.
అంటే.. “మేము దరఖాస్తు చేస్తున్నాం. కానీ ఈ ఆదేశం చట్టబద్ధమైనదని అంగీకరించడం లేదు” అన్నమాట. తాజాగా కోర్టులో వేసిన కేసులో డిస్నీ నేరుగా ఒక ఆరోపణ చేసింది. ట్రంప్ ప్రభుత్వం ABCపై ప్రతీకార చర్యలకు దిగుతోందని.
అంటే ప్రభుత్వం తనను విమర్శించే మీడియా సంస్థను నేరుగా మూసివేయకుండా.. దాని లైసెన్స్, నియంత్రణ అధికారాలను ఉపయోగించి ఒత్తిడి చేస్తోందని డిస్నీ వాదిస్తోంది.
మరి ఇది కేవలం డిస్నీ సమస్యేనా?
డిస్నీ ప్రపంచంలోని అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఒకటి. ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తే కోర్టుకు వెళ్లగలిగే డబ్బు, న్యాయ బలం దానికి ఉంది. కానీ చిన్న మీడియా సంస్థల పరిస్థితి ఏమిటి? ఒక చిన్న న్యూస్ ఛానల్ ప్రభుత్వాన్ని విమర్శించింది అనుకుందాం. దాని లైసెన్స్‌పై దర్యాప్తు మొదలైతే? రెన్యూవల్‌పై సమస్య వస్తుందనే భయం కలిగితే? అప్పుడు ఆ ఛానల్ మరుసటి రోజు నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వెనుకాడవచ్చు.
అంటే సెన్సార్షిప్ చేయడానికి ఎప్పుడూ ప్రభుత్వం “ఈ వార్త వేయొద్దు” అని చెప్పాల్సిన అవసరం లేదు. భయం కలిగిస్తే చాలు. అందుకే డిస్నీ ఇప్పుడు చేస్తున్న పోరాటం ABC కోసం మాత్రమే కాదు అని సంస్థ చెబుతోంది.
చివరికి ఎవరు గెలుస్తారు?
ఇది ఇంకా కోర్టులో తేలాల్సిన విషయం. ట్రంప్ ప్రభుత్వం, FCC తమ చర్యలకు చట్టపరమైన కారణాలు ఉన్నాయని వాదించవచ్చు. డిస్నీ మాత్రం ఈ చర్యల వెనుక రాజకీయ ప్రతీకారం ఉందని చెబుతోంది. ఇది ఇప్పుడు ట్రంప్ vs డిస్నీ పోరాటం.
ఇది ఒక అధ్యక్షుడు, ఒక మీడియా సంస్థ మధ్య గొడవలా కనిపించొచ్చు. కానీ తీర్పు మాత్రం అంతకంటే పెద్దదాన్ని నిర్ణయించవచ్చు. ప్రభుత్వానికి నచ్చని వార్త చెప్పే మీడియా.. భయపడకుండా మాట్లాడగలదా లేదా? అమెరికాలో ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం కోసం అందరి చూపూ కోర్టుపైనే ఉంది.








