గాంధీ రాసిన ఆ 688 పేజీలకు రూ.16.20 కోట్లు! అసలు వాటిలో ఏముంది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక వేలం గదిలో ఓ పాత కాగితాల కట్ట ముందుకు వచ్చింది. దానిపై సంతకం చేసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. భారత చరిత్రను మార్చిన మహాత్మా గాంధీ. వేలం ముందుకు సాగుతున్న కొద్దీ ఆ కాగితాల విలువ పెరుగుతూనే వెళ్లింది. చివరికి ఆగిన బిడ్ రూ.16.20 కోట్ల దగ్గర. ఒక చారిత్రక పత్రానికి ఇది ప్రపంచ రికార్డు. కానీ ఇంత భారీ ధర పలికేలా ఆ కాగితాల్లో ఉన్నదేమిటి? గాంధీ స్వయంగా రాసిన ఆ 688 పేజీలు ఇంత ప్రత్యేకం కావడానికి అసలు కారణమేంటి?
సమాధానం తెలుసుకోవాలంటే గాంధీని మనం సాధారణంగా చూసే కోణాన్ని కాసేపు పక్కన పెట్టాలి. స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడిగా కాదు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడిగా కాదు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగాలు చేసిన గాంధీగా కూడా కాదు. మరి ఎవరిలా చూడాలి?
ఇక్కడ కనిపించేది చాలా వ్యక్తిగతమైన గాంధీ.
సాఫ్రన్ఆర్ట్ నిర్వహించిన ‘Gandhi: From the Collection of Anand T Hingorani’ వేలంలో గాంధీ స్వయంగా రాసిన 688 ఆలోచనల సమాహారం ‘A Thought for the Day’ రూ.16.20 కోట్లకు అమ్ముడైంది. భారతీయ చారిత్రక పత్రం వేలంలో పలికిన అత్యధిక ధరగా ఇది కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
ఈ పత్రాలు ఆనంద్ టీ. హింగోరానీకి సంబంధించినవి. స్వాతంత్ర్య సమరయోధుడైన హింగోరానీ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తుల్లో ఒకరు.
హింగోరానీ భార్య విద్య మరణించిన తర్వాత ఆయన జీవితంలో ఒక తీవ్రమైన వ్యక్తిగత విషాదం ఏర్పడింది. ఆ సమయంలో గాంధీ ఆయనకు తోడుగా నిలిచారు. ఒకటి రెండు లేఖలతో ఆగిపోలేదు. దాదాపు రెండేళ్ల పాటు ప్రతిరోజూ ఒక ఆలోచన, ఒక సందేశం, ఒక మార్గదర్శకత్వాన్ని చేతిరాతలో పంపించారు.
తర్వాత ఆ సందేశాలన్నింటినీ కలిపి ‘A Thought for the Day’ అనే పుస్తకంగా రూపొందించారు.
ఇక్కడే ఈ పత్రాల అసలు విలువ బయటపడింది.
గాంధీ దేశం కోసం రాసిన పెద్ద పెద్ద ప్రకటనల కంటే, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధకు స్పందిస్తూ రాసిన మాటలు ఇవి. అందుకే ఈ 688 పేజీలు ఆయన రాజకీయ జీవితాన్ని మాత్రమే కాదు, ఆయన ఆలోచనా విధానాన్ని, వ్యక్తిగత నమ్మకాలను కూడా చాలా దగ్గరగా చూపిస్తాయి.
సత్యం గురించి ఆయన ఎలా ఆలోచించారు? అహింసను కేవలం రాజకీయ ఆయుధంగా కాకుండా జీవిత విధానంగా ఎలా చూశారు? భయం ఎదురైనప్పుడు మనిషి ఎలా స్పందించాలి? కోరికలు, బాధ్యతలు, మతం, దేవుడు, సేవ, క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన ఎలా అర్థం చేసుకున్నారు?
ఈ పత్రాల్లో ఇలాంటి అనేక అంశాలు కనిపిస్తాయి.
సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, నిర్భయత్వం, మత సమానత్వం, అంటరానితనం నిర్మూలన, ప్రార్థన, రామనామం, సేవ, శ్రమ, ఆకలి, కర్తవ్యం, స్వరాజ్యం, నైతిక బాధ్యత, మౌనం, మనస్సాక్షి, అనాసక్తి, ఆత్మసాక్షాత్కారం, దేవుడి అన్వేషణ వంటి అంశాలపై గాంధీ తన ఆలోచనలను నమోదు చేశారు.
అంటే ఈ పత్రాల్లో కనిపించేది ఒక రాజకీయ నాయకుడి వ్యూహం కాదు. ఒక మనిషి జీవితాన్ని ఎలా నడపాలనే దానిపై మరో మనిషికి ఇచ్చిన సలహా. ఇదే ఈ సేకరణను చారిత్రకంగా మరింత అరుదైనదిగా చేసింది.
చరిత్రలో కనిపించని గాంధీ
మనకు గాంధీ గురించి తెలిసిన కథ ఎక్కువగా బహిరంగ జీవితానికి సంబంధించినది. సభలు, ఉద్యమాలు, నిరసనలు, జైలు జీవితం, రాజకీయ చర్చలు, స్వాతంత్ర్య పోరాటం… కానీ ఒక వ్యక్తి నిజంగా ఎలా ఆలోచించేవాడో తెలుసుకోవాలంటే అతను పెద్ద వేదికపై మాట్లాడిన మాటలతో పాటు, సన్నిహితులకు రాసిన మాటలను కూడా చూడాలి.
హింగోరానీకి రాసిన ఈ సందేశాలు అలాంటి వ్యక్తిగత ప్రపంచానికి ఒక కిటికీలా నిలుస్తాయి. ఒకవైపు బాధలో ఉన్న వ్యక్తికి గాంధీ ఇచ్చిన ఓదార్పు కనిపిస్తే, మరోవైపు తన సిద్ధాంతాలను రోజువారీ జీవితానికి ఎలా అన్వయించేవారో తెలుస్తుంది. అందుకే సాఫ్రన్ఆర్ట్ సహ వ్యవస్థాపకుడు దినేశ్ వజీరానీ కూడా ఈ సేకరణ ప్రత్యేకతను గాంధీ, హింగోరానీ మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధంలోనే చూశారు.
వేలంలో మరిన్ని గాంధీ జ్ఞాపకాలు
ఈ వేలం ఒక్క ‘A Thought for the Day’తో మాత్రమే ముగియలేదు. మొత్తం 86 లాట్లలో గాంధీకి సంబంధించిన లేఖలు, మాన్యుస్క్రిప్టులు, ఫొటోలు, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. హింగోరానీ కుటుంబం తరతరాలుగా సంరక్షించిన ఈ సేకరణ రెండు దశాబ్దాలకు పైగా సాగిన గాంధీ–హింగోరానీ సంబంధానికి సంబంధించిన అరుదైన ఆధారాలను ఒకచోటికి తీసుకొచ్చింది.
వాటిలో ‘Message on God’ అనే మరో ముఖ్యమైన సేకరణ ఉంది. గాంధీ దేవుడు, భగవద్గీతపై చేసిన ఆలోచనలకు సంబంధించిన మూడు మాన్యుస్క్రిప్ట్, కరస్పాండెన్స్ పత్రాలు ఇందులో ఉన్నాయి. ఇది రూ.1.68 కోట్లకు అమ్ముడైంది.
అలాగే గాంధీ ఉపయోగించిన ‘పెటీ చర్కా’ కూడా వేలంలో ఉంది. పెట్టెలో అమర్చిన ఈ చిన్న చరకాతో పాటు, చరకా తిప్పడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి గాంధీ రాసిన రెండు లేఖలు కూడా ఉన్నాయి.
రూ.50–70 లక్షల వరకు ధర పలుకుతుందని అంచనా వేసిన ఈ చరకా చివరికి రూ.1.02 కోట్లకు అమ్ముడైంది. గాంధీ రాస్తున్న సమయంలో తీసిన సంతకం చేసిన ఫొటో రూ.78 లక్షలు పలికింది. ఆర్థిక స్వాతంత్ర్యంపై గాంధీ రాసిన లేఖలు, టెలిగ్రామ్లు, పోస్టుకార్డుల సేకరణ రూ.57.60 లక్షలకు అమ్ముడైంది.








