భారత్‌లో NRI పెట్టుబడులకు కొత్త రూల్స్.. ఏం మారనుందంటే?
అమెరికాలో ఒక వ్యక్తి తన ఫోన్లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌ను చూస్తున్నాడు.
ఒక కంపెనీ షేర్ నచ్చింది. కొనాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు అతని అకౌంట్లోనే ఉంది. ఇండియాలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కూడా కొత్తది కాదు. కానీ కొనాలంటే ముందుగా ఒక పని పూర్తి చేయాలి.
KYC.
అతను కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేస్తాడు. వెరిఫికేషన్ కోసం పంపిస్తాడు. మరోవైపు నుంచి ఇంకో డాక్యుమెంట్ అడుగుతారు. ఒక ఫార్మాలిటీ పూర్తవుతుంది. మరోటి మొదలవుతుంది.
అక్కడే అతనికి ఒక ప్రశ్న వస్తుంది. ఇండియాలో డిజిటల్‌గా డబ్బు పంపించగలిగినప్పుడు.. ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఇంత కష్టం ఎందుకు?
ఇది ఒక్క అమెరికాలో ఉన్న వ్యక్తి సమస్య కాదు.
లండన్‌లో ఉన్న NRI అయినా, సింగపూర్‌లో ఉన్న వ్యక్తి అయినా, దుబాయ్‌లో ఉన్న భారతీయుడైనా.. ఇండియాలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి onboarding సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే..
పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తికి డబ్బు ఉంది. నిర్ణయం కూడా ఉంది. కానీ మధ్యలో ఉన్న ప్రక్రియ మాత్రం ఇంకా అతన్ని ఆపగలుగుతోంది.
ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు రావచ్చనే సంకేతం వచ్చింది. అది కూడా పెట్టుబడి మార్కెట్‌ను నియంత్రించే సంస్థ నుంచే.
SEBI ఏం మార్చాలనుకుంటోంది?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆగస్టు 14న విడుదల చేసిన consultation paperలో విదేశాల్లో నివసించే వ్యక్తుల KYC ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదన చేసింది.
ప్రస్తుతం ఉన్న డిజిటల్ onboarding విధానంలో overseas investorsకు ఒక ప్రత్యేక సమస్య ఉంది. Intermediaries పెట్టుబడిదారుడి భారతదేశంలోని locationను capture చేయాల్సి రావడం వల్ల ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని SEBI గుర్తించింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం జరుగుతోంది.
ప్రతిపాదన అమల్లోకి వస్తే, అర్హత ఉన్న NRIలు, OCIలు, అలాగే కొన్ని అర్హతలు కలిగిన విదేశీ పౌరులు తాము నివసిస్తున్న దేశం నుంచే డిజిటల్‌గా KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
అంటే..
ఇండియాలో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత, కేవలం account-opening formalities కోసం ఇండియాకు రావాల్సిన అవసరం తగ్గవచ్చు.
ఇంతకాలం అసలు ఇబ్బంది ఏంటి? ఇక్కడ సమస్య పెట్టుబడి నిర్ణయం కాదు. Onboarding. Alankit Limited Wealth Management Business Head శరద్ చంద్ చెప్పినదీ ఇదే.
విదేశాల్లో ఉన్న వ్యక్తికి ఇండియాలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే నిర్ణయం సులభంగా ఉండొచ్చు. కానీ account opening, KYC, documentation, verification వంటి ప్రక్రియలే అసలు frictionగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరి ఇప్పుడు ఏం మారొచ్చు?
ఇదే SEBI ప్రతిపాదనలో కీలకమైన భాగం. అర్హత ఉన్న overseas investors తమ నివాస దేశం నుంచే KYC పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలన్నది ప్రతిపాదనలో ఉంది. అంటే పెట్టుబడిదారుడి భౌగోళిక స్థానం ఇక account openingకు అంత పెద్ద అడ్డంకిగా ఉండకపోవచ్చు.
దీంతో paperwork తగ్గడం మాత్రమే కాదు. పెట్టుబడి మొదలు పెట్టడానికి పట్టే సమయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే online financial servicesలో ఒకటి రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని చాలామంది వినియోగదారులు ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో వారాలు పట్టే onboarding ప్రక్రియ సహజంగానే ఒక deterrentగా మారుతుంది. డిజిటల్ KYC వ్యవస్థ మెరుగైతే ఆ friction తగ్గవచ్చు.
NRIల డబ్బు భారత్‌కు ఎందుకు ముఖ్యం?
దేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహం కేవలం రిజర్వులు పెంచడానికే కాదు. దిగుమతుల బిల్లు, కరెంట్ అకౌంట్ లోటు, రూపాయి స్థిరత్వం వంటి అంశాల్లో కూడా external inflows కీలకంగా ఉంటాయి. FY25లోనే బలమైన remittance inflows భారత్ current account positionను స్థిరంగా ఉంచడంలో సహాయపడ్డాయని Economic Survey పేర్కొంది.ఇదే SEBI ప్రతిపాదన వెనుక ఉన్న పెద్ద కథ.
NRI ఒకసారి ఇండియాకు డబ్బు పంపితే అది కుటుంబ ఖర్చులకు వెళ్లొచ్చు. ఇల్లు కొనడానికి వెళ్లొచ్చు. బ్యాంకులో డిపాజిట్ కావొచ్చు. కానీ అదే డబ్బు భారత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక ఆస్తుల్లో పెట్టుబడిగా మారితే.. అది నేరుగా భారత క్యాపిటల్ మార్కెట్లోకి వెళ్తుంది.
Nithin Kamath ఎందుకు దీనిని స్వాగతించారు?
ఈ ప్రతిపాదనపై పరిశ్రమ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. Zerodha వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్.. NRI onboarding సులభమైతే భారత మార్కెట్లలోకి మరింత NRI పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అసలు కీలకం
విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే.. అతను ఎక్కడ ఉన్నాడనే విషయం కంటే అతను అర్హుడా, అతని గుర్తింపు సరిగ్గా verify అయిందా అన్నదే ముఖ్యమయ్యే విధానానికి SEBI వెళ్లాలని చూస్తోంది.
అమల్లోకి వస్తే..
దుబాయ్ నుంచి ఇండియాకు విమానం ఎక్కాల్సిన అవసరం లేకుండానే, లండన్ నుంచి courier పంపాల్సిన అవసరం లేకుండానే, అమెరికాలో కూర్చుని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రక్రియ మరింత సులభం కావచ్చు.
చివరికి SEBI ప్రతిపాదన తెరిచేది కేవలం ఒక KYC ప్రక్రియ కాదు. విదేశాల్లో ఉన్న భారతీయుడికి.. తన దేశ ఆర్థిక వ్యవస్థతో మరింత సులభంగా మళ్లీ కనెక్ట్ అయ్యే ఒక తలుపు.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








