డీఎస్సీపై లోకేశ్ వరుస సవాళ్లు.. జగన్ స్పందన కోసం మూడో రోజు వెయిటింగ్..
డీఎస్సీ (DSC) అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై వైసీపీ (YSRCP) చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు సంబంధించి తాను ఇచ్చిన సవాల్‌పై మూడో రోజు కూడా సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో డీఎస్సీ నియామకాలు, పరీక్షా విధానం తదితర అంశాలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు లోకేశ్ ఇప్పటికే బహిరంగ చర్చకు ఆహ్వానించారు. సభలో అయినా, బయట అయినా చర్చించేందుకు సిద్ధమని, వేదికను కూడా జగన్ నిర్ణయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే తన సవాల్‌కు ఇప్పటివరకు జగన్ నుంచి నేరుగా స్పందన రాలేదని లోకేశ్ పేర్కొంటున్నారు.
మంగళవారం రెండోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించిన మంత్రి, బుధవారం ఉదయం మరోసారి ఎక్స్ (X) వేదికగా స్పందించారు. జగన్ కోసం మూడో రోజు కూడా ఎదురుచూస్తున్నానని, తన చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినని, జగన్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కావడంతో చర్చకు వేదికను ఎంపిక చేసే అవకాశాన్ని కూడా ఆయనకే ఇస్తున్నానని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో రాజకీయ సందేశాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోకేశ్ తరచూ ముందుంటారు. ఈసారి కూడా వరుస పోస్టులతో డీఎస్సీ అంశాన్ని రాజకీయ చర్చలో కొనసాగిస్తున్నారు. రెండో రోజు పోస్టులో మీమ్‌ను ఉపయోగించిన ఆయన, మూడో రోజు కూడా ‘స్టిల్ వెయిటింగ్’ అనే భావనను చూపించే గిఫ్‌ను జత చేయడం ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వైసీపీ నుంచి లోకేశ్‌కు నేరుగా స్పందన కనిపించకపోయినా, గతంలో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రస్తావిస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేశ్‌తో చర్చకు తాను సిద్ధమని గతంలో పేర్ని నాని సవాల్ చేసిన విషయాన్ని వైసీపీ ప్రచారం చేస్తోంది.
ఇదిలా ఉండగా, బుధవారం తాడేపల్లి (Tadepalli)లో జగన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీపై లోకేశ్ చేసిన సవాల్‌పై జగన్ స్పందిస్తారా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొత్తంగా చూస్తే డీఎస్సీ అంశం ఇప్పుడు కేవలం ఉద్యోగ నియామకాల వ్యవహారానికే పరిమితం కాకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. లోకేశ్ వరుస సవాళ్లకు వైసీపీ అధినేత ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.








