కవితతో రికీ రాధన్ పండిట్ భేటీ.. ఏంటి సంగతి?
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ రాజకీయ పోరాటంలో భాగంగా తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌తో కవిత జరిపిన సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు నాట రాజకీయ నేతల్లో జ్యోతిష్యం, వాస్తు, యాగాల పట్ల నమ్మకం ఎప్పటినుంచో ఉన్నదే. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి ఈ అంశాలపై అపారమైన విశ్వాసం ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అధికారంలో ఉన్న కాలం వరకు కేసీఆర్ ఎన్నో చండీ యాగాలు, సుదర్శన యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కీలక రాజకీయ నిర్ణయాలు, ముహూర్తాలు, పార్టీ నామకరణాలు సైతం జ్యోతిష్య పండితుల సూచనల మేరకే ఖరారు చేసే సంప్రదాయం ఆ కుటుంబంలో కనిపిస్తుంది. ఇప్పుడు అదే బాటలో కవిత కూడా తన సరికొత్త రాజకీయ ప్రయాణానికి గ్రహబలం, దైవబలం తోడుండాలని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తాజా భేటీ స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం కేవలం సాధారణ మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదని, దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని ప్రచారం సాగుతోంది. రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌కు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో రాజకీయ జ్యోతిష్యుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన గతంలో చేసిన విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అటువంటి ప్రసిద్ధ పండితుడితో కవిత మంతనాలు జరపడం ద్వారా.. తన సరికొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన జాతక బలం, పార్టీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికల్లో ఎదురయ్యే రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన పూజలు, యాగాలు లాంటి వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ ప్రచార ముహూర్తాలు, కీలక నిర్ణయాల సమయాలు, వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం పొందినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి ప్రజల్లో ఆదరణ కల్పించడమే కాకుండా, విపక్షాలు, అధికార పక్షాల నుంచి ఎదురయ్యే రాజకీయ సవాళ్లను తిప్పికొట్టడానికి కవిత అన్ని దారులనూ అన్వేషిస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు, కేడర్ నిర్మాణంపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు సంప్రదాయ నమ్మకాలు, జ్యోతిష్యుల సలహాలతో తన రాజకీయ దశను మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.
రాజకీయాల్లో నాయకుల వ్యూహాలు, ప్రజా మద్దతు ఎంత కీలకమో.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ అందించే గ్రహస్థితి విశ్లేషణలు, సూచనలు కవిత రాజకీయ భవిష్యత్తుకు, తెలంగాణ రక్షణ సేనకు ఏ మేరకు మైలేజీ ఇస్తాయో, తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఈ కొత్త పార్టీ ఎంతటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.








