మన శరీరాన్ని కంట్రోలు చేసే రిమోట్ కంట్రోల్! కొరియా శాస్త్రవేత్తల షాకింగ్ ప్రయోగం
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీకు ఒక మందు ఇచ్చారు.
ఆ మందు శరీరానికి చాలా అవసరం. కానీ ఒక సమస్య ఉంది. అది అవసరమైనప్పుడు మాత్రమే పనిచేయాలి. ఎక్కువగా పనిచేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. తక్కువైతే చికిత్స సరిగా పనిచేయకపోవచ్చు. మరెలా మందు చేత ఎలా పనిచేయించగలం అంటారా..సపోజ్ ఇప్పుడు మీ చేతిలో ఒక చిన్న స్విచ్ ఉందనుకోండి.
మందు అవసరమైనప్పుడు…
ON.
శరీరంలో దాని ప్రభావం మొదలవుతుంది. అది ఎక్కువైందనిపిస్తే…
OFF.
మళ్లీ అవసరం వచ్చినప్పుడు…
ON.
ఇలా మందు మోతాదును ఇలా బయట నుంచే నియంత్రించగలిగితే వైద్యం ఎంత సులభమవుతుందో ఊహించండి. ఇప్పుడు ఇదే ఆలోచనను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.అయితే అది మందుకు కాదు… మన శరీరంలోని జీన్లకు వర్తింపజేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
అసలా ప్రయోగం ఏంటి
దక్షిణ కొరియాలోని Dongguk University పరిశోధకులు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా జీవించి ఉన్న ఎలుకల శరీరంలోని నిర్దిష్ట జన్యువులను బయట నుంచే యాక్టివేట్ చేయగల “gene switch” ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా, ఆ సంకేతాన్ని ఆపిన తర్వాత gene activity మళ్లీ baseline స్థాయికి తిరిగి వచ్చింది. అంటే భవిష్యత్తులో జీన్ థెరపీ కూడా ఒక రిమోట్ కంట్రోల్ ఉన్న చికిత్సగా మారే అవకాశం ఉందన్నమాట.
ఇప్పటి జీన్ థెరపీకి సమస్య ఏమిటి?
జీన్ థెరపీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే… శరీరంలో సరిగ్గా పనిచేయని ఒక biological processను మార్చడానికి లేదా అవసరమైన protein తయారయ్యేలా చేయడానికి జన్యు స్థాయిలో జోక్యం చేసుకోవడం.
అయితే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ జన్యువును ఎప్పుడు పనిచేయించాలి? ఎంతసేపు పనిచేయించాలి? ఎప్పుడు ఆపాలి? ఇది చాలా ముఖ్యం.
సపోజ్ …మీ శరీరంకి ఒక protein అవసరమైందనుకోండి. అది తక్కువగా ఉంటే సమస్య.
అయితే అదే protein నిరంతరం ఎక్కువగా తయారవుతుంటే? అదీ సమస్య కావచ్చు. అందుకే శాస్త్రవేత్తలకు చాలాకాలంగా ఒక ఆలోచన ఉంది: “జీన్‌కు కూడా ఒక ON/OFF switch ఉంటే?” అదే ఇప్పుడు కొరియా పరిశోధకులు పరీక్షించిన ఆలోచన.
శాస్త్రవేత్తలు మనిషి శరీరానికి నేరుగా కరెంట్ పంపి జీన్లను ఆన్ చేయలేదు. వారు electromagnetic field (EMF) ను ఉపయోగించారు. మొదట ఎలుకల మెదడు కణాలను 2.0 millitesla, 60 hertz electromagnetic fieldకు గురిచేసి, ఏ genes స్పందిస్తున్నాయో పరిశీలించారు. అందులో Lgr4 అనే gene ప్రత్యేకంగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. ఆ geneకి సంబంధించిన regulatory regionను ఉపయోగించి వారు Electromagnetic-field-inducible (Ei) gene switchను తయారు చేశారు.
ఫలితం?
జీన్ అనుకున్నట్లుగానే యాక్టివేట్ అయింది. మరింత ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, మొత్తం శరీరాన్ని కాకుండా నిర్దిష్ట ప్రాంతాలను target చేసినప్పుడు సంబంధిత organsలో gene expressionను కూడా నియంత్రించగలిగారు. అంటే ఇది కేవలం ON/OFF మాత్రమే కాదు. భవిష్యత్తులో ఎక్కడ , ఏ ఆర్గాన్ లో ON చేయాలి? ఎప్పుడు ఆఫ్ చేయాలి? ఎంతసేపు ONలో ఉంచాలి? అనే నియంత్రణకు కూడా మార్గం చూపిస్తోంది. ఇదే భవిష్యత్తులో జీన్ థెరపీకి remote control లాంటి ఆలోచన.
మరి ఇది మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది?
ప్రస్తుతం ఇది ఎలుకల్లో జరిగిన ప్రయోగం మాత్రమే. కానీ ఈ విధానం మనుషుల్లో సురక్షితంగా పనిచేస్తుందని భవిష్యత్తులో నిరూపితమైతే, కొన్ని gene therapiesను మరింత adjustableగా మార్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లో దీన్ని ఉపయోగించాలంటే ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. దీర్ఘకాలంలో ఇది ఎంత సురక్షితం? ఏ tissueలో ఎంత gene activation జరుగుతుంది? Immune system ఎలా స్పందిస్తుంది? Doseను ఎంత ఖచ్చితంగా నియంత్రించగలం?వంటివి ఇంకా పరీక్షించాల్సి ఉంది.
ఫైనల్ గా..
ఇప్పటివరకు మనం మందు తీసుకున్నాం. రేపు మందు శరీరంలోనే ఉండొచ్చు…అలాగే దాన్ని ఎప్పుడు పనిచేయించాలో కూడా మన చేతిలో ఉండొచ్చు.








