అమెరికా వెళ్లిన టెకీలు ఇంతమంది వెనక్కి వచ్చేస్తున్నారా? .. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు అమెరికా వెళ్లడం అంటే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే.
ముఖ్యంగా టెక్ ఉద్యోగులకు అయితే అమెరికా ఒక డ్రీమ్ డెస్టినేషన్. మంచి జీతం. పెద్ద కంపెనీ. భారీ కెరీర్ అవకాశాలు. పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే ఇండియా నుంచి వేలాది మంది టెకీలు అమెరికా బాట పట్టారు. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన సీన్ కనిపిస్తోంది.
అమెరికా వెళ్లిన టెకీలే తిరిగి ఇండియాకు వస్తున్నారు. అది కూడా ఒక్కరిద్దరు కాదు.వేలల్లో. బెంగళూరుకు చెందిన టాలెంట్ కన్సల్టింగ్ సంస్థ Xpheno డేటా ప్రకారం, 2024లో సుమారు 9,800 మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. 2025లో ఈ సంఖ్య ఏకంగా 15,100కి చేరింది. 2026లో ఇప్పటివరకు మరో 7,300 మంది తిరిగి వచ్చినట్లు డేటా చెబుతోంది.
అయితే వీళ్లంతా అమెరికాలో ఉద్యోగాలు దొరకకపోవడంతోనే వచ్చేశారని అనుకోవద్దు.మరేంటి సమస్య అంటే అమెరికాలో ఉద్యోగం ఉండటం అనే ఆనందం కంటే.. ఆ ఉద్యోగం రేపు ఉంటుందా అనే భయం పెరిగింది.
టెక్ రంగంలో ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి. AI, automation, cost cutting కారణంగా పెద్ద టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. ఉద్యోగం పోయిన విదేశీ ఉద్యోగులకు సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
ఎందుకంటే H-1B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే కొత్త employerను వెతుక్కోవడానికి సాధారణంగా 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది.
ఆ సమయంలో కొత్త ఉద్యోగం దొరకకపోతే?
అమెరికా వదిలి వెళ్లాల్సి రావచ్చు. అంటే ఒక అమెరికన్ ఉద్యోగికి “ఉద్యోగం పోయింది” అనేది ఒక సమస్య. H-1B ఉద్యోగికి మాత్రం “ఉద్యోగం పోయింది.. దేశం కూడా వదలాల్సి రావచ్చు” అనే మరో భయం ఉంటుంది. ఇప్పుడు దీనికి ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కఠినమైన H-1B నిబంధనలు తోడయ్యాయి.
కొత్త H-1B దరఖాస్తులపై $100,000 ఫీజు నిర్ణయం ఇప్పటికే పెద్ద కలకలం రేపింది. ఆ నిర్ణయంపై కోర్టు పోరాటం జరిగినప్పటికీ, విదేశీ టాలెంట్‌ను అమెరికాలోకి తీసుకురావడం ఇకపై మరింత ఖరీదైన, క్లిష్టమైన వ్యవహారంగా మారింది. సెప్టెంబర్ నుంచి H-1B extensions, renewalsపై అదనపు $4,000 surcharge ప్రతిపాదన కూడా ఉంది.
ఇక్కడే టెకీల ఆలోచన మారుతోంది.
“ఇంత రిస్క్ తీసుకుని అమెరికాలోనే ఎందుకు ఉండాలి?” . హాయిగా ఇండియాలో ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇండియా కూడా చాలా మారిపోయింది. పదేళ్ల క్రితం అమెరికాలో దొరికే కొన్ని హై-స్కిల్ టెక్ అవకాశాలు ఇండియాలో అంతగా ఉండేవి కావు.
ఇప్పుడా పరిస్థితి వేరు. ఇండియాలో దాదాపు 2,000 Global Capability Centres ఉన్నాయి. ఇవి కేవలం డేటా ఎంట్రీ లేదా బ్యాక్‌ఆఫీస్ పనులు చేసే సెంటర్లు కావు. AI, సాఫ్ట్వేర్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి కీలకమైన పనులు కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి.
ఈ GCCలు 2023 నుంచి ప్రతి సంవత్సరం సుమారు లక్ష మందిని నియమిస్తున్నట్లు పరిశ్రమ డేటా చెబుతోంది. గత 12 నెలల్లోనే టాప్ GCCలు దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి టెక్ ప్రొఫెషనల్స్‌ను తీసుకున్నాయి. వారిలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు.
అంటే ఒకప్పుడు ఇండియాలో ఉద్యోగం దొరకడం కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అమెరికాలో సంపాదించిన అనుభవంతో ఇండియాలోనే మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి ఏర్పడుతోంది.
జీతం తక్కువైనా ఇండియానే బెస్టా?
అమెరికాలో సంపాదించే డబ్బుతో పోలిస్తే ఇండియాలో ప్యాకేజీ తక్కువ కావచ్చు. కానీ ఇక్కడ మరో లెక్క ఉంది. అమెరికాలో భారీ జీతం ఉన్నా.. వీసా భయం. ఉద్యోగం ఉన్నా.. రేపు layoff అవుతానేమో అన్న భయం. కుటుంబం ఉన్నా.. పిల్లల భవిష్యత్తుపై ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి. ఇండియాలో జీతం కొంచెం తక్కువైనా.. కనీసం “రేపు దేశం వదిలి వెళ్లాలి” అనే టెన్షన్ ఉండదు. అందుకే కొంతమంది టెకీలు ఇప్పుడు జీతం కంటే stabilityకి విలువ ఇస్తున్నారు.
ఇది కేవలం ఇండియాలోనే జరుగుతున్న మార్పు కాదు. చైనా లో కూడా అదే పరిస్దితి. అక్కడ నుంచి కూడా విదేశాల్లో చదువుకున్న పెద్ద సంఖ్యలో విద్యార్థులు తిరిగి వస్తున్నారు. 2025లో 5.36 లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని చైనాకు తిరిగి వచ్చినట్లు చైనా విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉటంకిస్తూ నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పెరుగుతున్న స్వదేశీ టెక్ రంగం కూడా వారికి కొత్త అవకాశాలు ఇస్తోంది.
అంటే అమెరికా నుంచి టాలెంట్ బయటకు వెళ్లడానికి కేవలం ట్రంప్ ఒక్కరే కారణం కాదు. అమెరికా టెక్ మార్కెట్లో జరిగిన మార్పు కూడా అంతే ముఖ్యమైనది. అమెరికా ఒక విదేశీ టెక్ ఉద్యోగిని తీసుకురావడానికి వీసా, స్పాన్సర్షిప్, ఫీజులు, ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే.. అదే పని ఇండియాలోని టీమ్‌కు అప్పగించడం కంపెనీకి సులభం కావచ్చు.
ఇండియాకు ఏంటి లాభం
ఇదే సమయంలో ఇండియాకు ఒక భారీ అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన టెకీలు తిరిగి వస్తే.. వాళ్లు కేవలం ఉద్యోగం కోసం రావడం లేదు. అమెరికన్ కంపెనీల పని విధానం తెలుసుకుని వస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల అనుభవంతో వస్తున్నారు. మేనేజ్మెంట్, AI, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనుభవంతో వస్తున్నారు.
అంటే ఇండియాకు తిరిగి వస్తున్నది కేవలం టెక్ టాలెంట్ కాదు. అమెరికాలో తయారైన టెక్ అనుభవం కూడా. అందుకే ఇది సాధారణ migration story కాదు. ఇది ఒకప్పుడు ఒకే దిశలో సాగిన ప్రయాణం తిరిగి మరో దిశలో కదులుతున్న కథ. ఇన్నాళ్లు ఇండియా నుంచి టాలెంట్ అమెరికాకు వెళ్లింది. ఇప్పుడు ఆ టాలెంట్‌లో కొంత భాగం తిరిగి వస్తోంది.
ఏదైమైనా..
టాలెంట్‌ను ఆపాలని ప్రయత్నిస్తే.. పని మాత్రం ఆగదు. అది మరో దేశానికి వెళ్లిపోతుంది. ఇదే విషయాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా హెచ్చరించారు. విదేశీ టాలెంట్‌ను అమెరికాకి తీసుకురావడం కష్టమైతే, కంపెనీలు వర్క్ ని విదేశాలకు తరలించే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఇప్పుడు అదే నిజం కాబోతోంది. అమెరికా వీసా తలుపు మూస్తే.. ఇండియా టెక్ తలుపు తెరుచుకుంటోంది.








