అమెరికాలో గాంధీ స్మారకం వద్ద ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
టెక్సాస్‌లోని డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలోని మహాత్మా గాంధీ స్మారకం వద్ద భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘హర్‌ఘర్ తిరంగా’ నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సంగీత గురువు సమీరా శ్రీపాద ఆధ్వర్యంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో పాటు దేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, వీర్ సావర్కర్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానుభావులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు.
అతిథుల ప్రసంగాలు…
ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ అల్ జపంటా మాట్లాడుతూ.. అమెరికా, భారత్ అనే రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య దృఢమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన ‘ఈనాడు’ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిని ఇక్కడ విస్తరిస్తూ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 79 సంవత్సరాల్లో భారత్ అక్షరాస్యత శాతం 12 నుంచి 81 శాతానికి పెరిగిందని, ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా మారిందని గుర్తుచేశారు. ఫార్మసీ రంగంలో ఎంతో పురోగతి సాధించి, కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు టీకాలు అందించే స్థాయికి చేరిందని తెలిపారు. అదే సమయంలో రైతు సమస్యలు, నిరుద్యోగం, వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం వంటి సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయని, దేశ ప్రగతికి ప్రవాసులు తోచిన విధంగా సహకరించాలని కోరారు.
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక అద్భుతమైన పద్యాన్ని శ్రావ్యంగా వినిపించారు. మరో ప్రత్యేక అతిథి సంఘ సేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికీ 80వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సత్కారాలు , ప్రముఖుల భాగస్వామ్యం:
ఈ వేడుకల్లో భాగంగా దేశ రక్షణలో సైనికులుగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలతో పాటు కొలంబియా నిర్వహించిన చెస్ పోటీల్లో సత్తా చాటిన సరయు తలపనేనిలను మేయర్ అల్ జపంటా, డాక్టర్ ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ తాయబ్ కుండావాలా.. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ వేడుకల్లో బోర్డు సభ్యులు, ఏపీ పూర్వ డీజీపీ డా. కె. అరవిందరావుతో పాటు వందలాది మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందించారు.









