“పహల్గామ్ లవ్ స్టోరీ” రివ్యూ: ప్రేమకథకు థ్రిల్లర్ టచ్
రేటింగ్: 3/5
సాగర్ (కృష్ణబాబు), చిత్ర (చిత్ర శుక్ల) ప్రేమలో మునిగి తేలుతున్న జంట. కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ, తమ ప్రయాణాన్ని కెమెరాలో బంధిస్తూ గడపాలని పహల్గామ్కి వెళ్తారు. కానీ ఓ అనుకోని క్షణంలో వాళ్ల కెమెరా ఒక హత్యను రికార్డ్ చేయడంతో ఆ అందమైన ప్రయాణం ఒక్కసారిగా ప్రమాదకరమైన ఆటగా మారుతుంది. ఆ హత్య వెనుక ఉన్నది ఉగ్రవాదుల ముఠా కావడంతో.. ఆ కెమెరాలోని ఫుటేజ్ వారికి కీలకమైన ఆధారంగా మారుతుంది.
ఆ ఫుటేజ్ తమ చేతికి రాకపోతే తమ రహస్యం బయటపడుతుందని గ్రహించిన ఉగ్రవాదులు సాగర్, చిత్రలను వెంబడించడం మొదలుపెడతారు. చిత్రను కాపాడేందుకు సాగర్ ఆమెను సురక్షితంగా తన ఊరికి పంపిస్తాడు. కానీ తాను మాత్రం వారి ఉచ్చులో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి కథలో మరో టర్న్ తీసుకుంటుంది. సాగర్‌పై వరుసగా నేరాలు మోపబడతాయి. నిజమైన నేరస్థులు నీడల్లో ఉండగా.. సాగర్ మాత్రం పోలీసుల దృష్టిలో అనుమానితుడిగా మారిపోతాడు.
ఇదిలా ఉంటే, చిత్ర కుటుంబం కూడా ఉగ్రవాదుల ఒత్తిడికి గురవుతుంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న చిత్ర.. సాగర్ ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడని గ్రహిస్తుంది. అతడిని కాపాడుకోవడానికి ఆమె స్వయంగా ఆ ప్రమాదం వైపు అడుగులు వేస్తుంది. సాగర్‌ను వెతుక్కుంటూ వెళ్లే కొద్దీ ఆమెకు ఆ కెమెరా ఫుటేజ్ వెనుక దాగి ఉన్న అసలు కుట్రపై మరిన్ని ఆధారాలు దొరుకుతాయి.అప్పుడు చిత్ర ఏం చేసింది. సాగర్ ని ఎలా రక్షించింది. ఉగ్ర కుట్రను ఎలా బయిటపెట్టింది. అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
ఎనాలిసిస్
కథా పరంగా చూస్తే.. ప్రేమకథను ఒక థ్రిల్లర్‌కు ఎమోషనల్ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఒక సాధారణ ప్రయాణంలో జరిగిన అనుకోని సంఘటన ఇద్దరి జీవితాలను తలకిందులు చేయడం మంచి హుక్‌ను అందిస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్‌కు మరింత బలమైన మిస్టరీ లేయర్, విలన్‌కు మరింత వ్యూహాత్మకమైన ప్రెజెన్స్ ఉంటే కథలోని టెన్షన్ మరింత పెరిగేది. అయినప్పటికీ ప్రేమ, ప్రమాదం, ఉగ్రవాదం, నిజాన్ని బయటపెట్టే పోరాటాన్ని ఒకే కథలో కలపాలనే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది.
అలాగే ఈ కథకు స్క్రీన్‌ప్లే పరంగా ఉన్న ప్రధాన బలం జానర్ ట్రాన్స్ఫర్మేషన్. సినిమా మొదట ఒక లవ్ స్టోరీలా మొదలై, క్రమంగా సర్వైవల్ థ్రిల్లర్‌గా మారుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా.. సాగర్, చిత్రలకు ఎదురయ్యే ప్రమాదం పెరుగుతున్న కొద్దీ జరగడం కథకు సహజమైన ఫ్లోను ఇస్తుంది.
ముఖ్యంగా కెమెరాలో క్యాప్చర్ అయిన హత్య కథకు కీలకమైన స్క్రీన్‌ప్లే డివైస్‌గా పనిచేస్తుంది. అదే కెమెరా మొదట ప్రేమ జ్ఞాపకాలను రికార్డ్ చేస్తుంది. తర్వాత అదే కెమెరా ఇద్దరి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. చివరికి అదే ఫుటేజ్ నిజాన్ని బయటపెట్టే ఆయుధంగా మారుతుంది. ఈ కనెక్టింగ్ థ్రెడ్ కథకు మంచి స్క్రీన్‌ప్లే ఐడియాను ఇస్తుంది.
అయితే ఇక్కడే స్క్రిప్ట్ మరింత బలపడింది కొంత అని చెప్పాలి. ఆ ఫుటేజ్‌లో అసలు ఏం ఉంది? అది బయటపడితే ఉగ్రవాదులకు ఎందుకు అంత ప్రమాదం? అనే ప్రశ్నలకు మరింత బలమైన మిస్టరీ లేయర్ ఉంటే ప్రేక్షకుడి ఆసక్తి మరింతగా పెరిగేది.
థ్రిల్లర్ కథలో హీరో తెలివిగా ఉండటం ఎంత ముఖ్యమో.. విలన్ కూడా అంతే తెలివిగా ఉండాలి. హీరో ఒక ప్లాన్ వేస్తే దానికి counter-plan ఉండాలి. హీరో తప్పించుకుంటే మరో మార్గంలో అతడిని విలన్ చుట్టుముట్టాలి.
ఇక్కడ విలన్‌ను ఇంకా “threat” కంటే “strategic antagonist” గా రాసి ఉంటే కథలో సస్పెన్స్ మరింత పెరిగేది.అయినా సినిమాలో చివరివరకూ ఓ విధమైన థ్రిల్, సస్పెన్స్ చివరి దాకా వెంటాడుతూనే ఉంది.
టెక్నికల్ గా
దర్శకుడుగా పి.ఎన్. రామచందర్ రావు సీనియార్టి అడుగడుగునా కనపడుతుంది. కథను ప్రేమకథగా మొదలుపెట్టి, క్రమంగా థ్రిల్లర్ జోన్లోకి తీసుకెళ్లడంలో మంచి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాశ్మీర్ నేపథ్యాన్ని కథకు అనుసంధానం చేయడం, ఎమోషన్ నుంచి టెన్షన్‌కు షిఫ్ట్ చేయడం బాగుంది.
సినిమాటోగ్రఫీ:
సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో కాశ్మీర్ లొకేషన్లు ఒకటి. ప్రకృతి అందాలను వైడ్ ఫ్రేమ్స్‌లో చూపించడం, ప్రేమ సన్నివేశాలకు ఓపెన్ విజువల్ స్పేస్ ఇవ్వడం బాగుంది.
ఎడిటింగ్:
ఫస్ట్ హాఫ్‌లో కథనం క్రిస్ప్‌గా అనిపిస్తుంది. మర్డర్ ఘటన తర్వాత సన్నివేశాలను వేగంగా కట్ చేయడం వల్ల కథలో urgency వచ్చింది. థ్రిల్లర్ పేసింగ్ బాగుంది.
మ్యూజిక్ & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
ప్రేమకథకు సంబంధించిన సన్నివేశాల్లో సంగీతం మూడ్‌ను సెట్ చేసింది.అలాగే సినిమా థ్రిల్లర్‌గా మారిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత కీలకంగా మారింది.
ప్రొడక్షన్ డిజైన్ & లొకేషన్స్:
కాశ్మీర్‌ను కేవలం అందమైన బ్యాక్‌డ్రాప్‌గా కాకుండా కథలో భాగంగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రయాణం, గ్రామీణ వాతావరణం, నగర నేపథ్యం.. కథకు అవసరమైన స్పేస్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ విషయంలో సినిమా మంచి విజువల్ బేస్‌ను ఉపయోగించుకుంది.
నటీనటుల పనితీరు:
సాగర్, చిత్ర పాత్రల్లో నటీనటులు ప్రేమ, భయం, ఒత్తిడి వంటి భావాలను తమ పరిధిలో బాగానే మోశారు. ముఖ్యంగా కథ థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్లలో వారి నటన కథకు అవసరమైన కనెక్షన్‌ను ఇచ్చింది.
ఫైనల్ థాట్
‘పహల్గామ్ లవ్ స్టోరీ’ ఒక పెద్ద కాన్సెప్ట్‌ను సింపుల్ ప్రేమకథ ద్వారా చెప్పే ప్రయత్నం. సినిమా బలమైన జాతీయ భావోద్వేగాన్ని కోరుకుంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి తనపై మోపిన నేరాన్ని తుడిచేసుకోవడానికి చేసే పోరాటాన్ని కూడా థ్రిల్లర్‌గా మలచాలని చూస్తుంది. ఈ రెండు లేయర్ల మధ్య సినిమా కొన్ని మంచి థ్రిల్స్ ను అందిస్తుంది.పూర్తిగా పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాకపోయినా.. చెప్పాలనుకున్న విషయంపై నమ్మకంతో నిలబడే ఒక sincere cinematic attemptగా ‘పహల్గామ్ లవ్ స్టోరీ’ మిగులుతుంది.








