భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి.. ఎన్నారైలతో మన్నవ మోహన కృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకుంటున్న చర్యలు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు వివరించారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలపై ఆయన చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో ఆధునిక టెక్నాలజీ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలిపారు.
క్వాంటం వ్యాలీ , సాంకేతిక రంగానికి ప్రాధాన్యత:
అమరావతిలో ప్రతిపాదిత ‘క్వాంటం వ్యాలీ’ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌టెక్, పరిశోధన , ఆవిష్కరణల రంగాల్లో సరికొత్త అవకాశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మన్నవ మోహన కృష్ణ వెల్లడించారు.
హైదరాబాద్ ఐటీ రంగ అభివృద్ధిలో గతంలో చంద్రబాబు నాయుడు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అదే అనుభవంతో అమరావతిలోనూ టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, పటిష్టమైన మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన పారదర్శక విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు.
పారిశ్రామికవేత్తల సానుకూల స్పందన:
అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తమ అనుభవాన్ని, పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంతో అనుసంధానం చేసుకోవాలని మన్నవ మోహన కృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పెట్టుబడులు పెరగడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , టెక్నాలజీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతపై సమావేశంలో పాల్గొన్న ఐటీ పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా కొత్త అవకాశాలు వస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.









