మీరు Ghost Jobకి అప్లై చేశారేమో? చూసుకోండి జాగ్రత్త
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీకు ఒక ఉద్యోగ ప్రకటన కనిపించింది.
జీతం బాగుంది. కంపెనీ పెద్దది. పోస్టు మీ అర్హతలకు సరిగ్గా సరిపోతోంది. మీరు వెంటనే రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు. కవర్ లెటర్ రాస్తారు. మీ అనుభవాన్ని ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా మార్చుకుంటారు.
కొన్ని గంటలు ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతారు.
ఆ తర్వాత? వెయిటింగ్ మోడ్ రోజులు, నెలలు.. ఏ సమాధానం రాదు. ఆశ పోక మీరు మరోసారి ఆ కంపెనీ వెబ్సైట్ చూస్తారు. అక్కడ అదే ఉద్యోగం ఇంకా కనిపిస్తుంది.
“We are hiring.”
మీకేమి అర్దం కాదు..మీకు కాల్ లెటర్ రాదు..ఇంటర్వూకి రమ్మనరు. ఉద్యోగం ఫిల్ చెయ్యరు.అయితే ఇక్కడే మీకు తెలియని ట్విస్ట్ . అసలు ఆ కంపెనీకి ఆ ఉద్యోగాన్ని భర్తీ చేసే ఉద్దేశమే లేకపోవచ్చు.
అంటే మీరు పోటీ పడింది మరో అభ్యర్థితో కాదు. లేని ఉద్యోగంతో. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థులను ఆందోళనకు గురిచేస్తున్న Ghost Job సమస్య.
అసలు Ghost Job అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే…ఉద్యోగం ఖాళీగా ఉన్నట్టు కంపెనీ ప్రకటన ఇస్తుంది. కానీ నిజానికి ఆ ఉద్యోగాన్ని వెంటనే భర్తీ చేయాలనే ఉద్దేశం ఉండదు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి, లేదా చిరుద్యోగి దానిని నమ్మి తన సమయం, శ్రమ, ఆశ అన్ని పెడతాడు. అందుకే దీనికి Ghost Job అనే పేరు వచ్చింది. ఉద్యోగ ప్రకటన ఉంది… కానీ దాని వెనుక నిజమైన ఉద్యోగం కనిపించదు.
కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి? వాటికేం సరదా
అన్ని Ghost Jobs వెనుక ఒకే కారణం ఉండదు. ఏ కంపెనీ కు తగ్గ కారణాలు ఆ కంపెనీకి ఉంటాయి.
1. భవిష్యత్తు కోసం టాలెంట్‌ను సేకరించడానికి
కంపెనీకి ప్రస్తుతం ఉద్యోగం భర్తీ చేయాల్సిన అవసరం లేకపోయినా, భవిష్యత్తులో మంచి అభ్యర్థులు దొరికితే వారిని సంప్రదించడానికి ప్రకటనను ఉంచవచ్చు. అంటే… ఇది కంపెనీకి Talent Bank.
2. కంపెనీ ఇంకా నియామకాలు చేస్తోందనే ఇమేజ్ కోసం
ఒక సంస్థ వెబ్సైట్లో వరుసగా ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తే… బయట నుంచి చూస్తున్నవారికి ఆ కంపెనీ విస్తరిస్తోందనే బిల్డప్ ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కొత్త టీమ్‌లు ఏర్పడుతున్నాయి. కంపెనీ వృద్ధి చెందుతోంది అనుకోవాలని. అంటే ఇక్కడ జాబ్ పోస్టింగ్ ఒక corporate image tool అన్నమాట.
3. నియామక ప్రక్రియను పూర్తిగా మూసివేయకపోవడం కొన్ని సందర్భాల్లో కంపెనీ బడ్జెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. లేదా కొత్త ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోకపోయి ఉండవచ్చు. కానీ HR వ్యవస్థలో ఉన్న పాత ఉద్యోగ ప్రకటన తొలగించబడకపోవచ్చు.
అయితే మనం నష్టపోయేది ఏమిటి?
ఒక Ghost Job… వల్ల మన సమయాన్ని మాత్రమే కాదు,ఇంత గొప్ప జాబ్ వస్తుందనే ఆశతో మన నెక్ట్స్ ఆఫర్ ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంకో ప్రమాదం ఉంది…అది మానసికంగా దిగులు. ఏమిటి ఏ ఉద్యోగానికి అప్లై చేసినా రిప్లై రావటం లేదనే బెంగ పెరిగిపోవచ్చు. అంటే… ఒక Ghost Job మన కెరీర్‌ను మాత్రమే కాదు.. మన self-confidenceను కూడా దెబ్బతీయగలదు.








