రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం ఎందుకు నో చెప్పింది?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. లండన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి బోస్టన్, న్యూయార్క్ వెళ్లాల్సిన సీఎం టూర్ హఠాత్తుగా రద్దు కావడంతో అనేక రాజకీయ, అంతర్జాతీయ దౌత్య సమీకరణాలు తెరపైకి వచ్చాయి.
సీఎం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లే ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల దరఖాస్తులను మదింపు చేసిన తర్వాతే రాజకీయ అనుమతులు ఇస్తామని తెలిపారు. అయితే, ఈ పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు సీఎం నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేకపోవడం వల్లే క్లియరెన్స్ ఇవ్వలేదని, యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చామని వెల్లడించారు.
ఈ నెలాఖరు వరకు సాగాల్సిన పర్యటనలో భాగంగా.. ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో రేవంత్ పాల్గొనాల్సి ఉంది. అయితే కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా, పర్యటన వెనుక మరికొన్ని కీలక రాజకీయ భేటీల ప్రయత్నాలు అనుమతి తిరస్కరణకు ప్రధాన కారణంగా మారాయని దౌత్య వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌తో పాటు అక్కడి అత్యున్నత స్థాయి రాజకీయ నేతలతో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం. భారత సమాఖ్య వ్యవస్థలో విదేశాంగ విధానం, అంతర్జాతీయ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షుడితో నేరుగా రాజకీయ భేటీ జరపడం ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధమని సౌత్ బ్లాక్ భావించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, న్యూయార్క్ స్థానిక రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే మేయర్ మమ్దానీ వంటి నేతలతో కూడా సమావేశమయ్యేందుకు సన్నాహాలు జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ట్రంప్ సర్కార్‌తో దౌత్య సమతుల్యతను కొనసాగిస్తున్న వేళ, ఓ భారత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేశ అధ్యక్షుడిని రాజకీయంగా తీవ్రంగా విభేదించే వర్గాలతో బహిరంగంగా భేటీ కావడం ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ప్రతికూలంగా మారవచ్చని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో భారత్ ఫ్యూచర్ సిటీ కోసం హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్ట్రన్, వర్జీనియా టెక్ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకే తాను పర్యటన ఖరారు చేసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో ఆయన ఆగస్టు 23నే హైదరాబాద్‌కు తిరిగి రానుండగా, అధికారుల బృందం మాత్రం యూఎస్‌లో ఒప్పందాలను పూర్తి చేస్తుందని ప్రకటించారు.
అయితే, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఇప్పటికే నడుస్తున్న రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ వేదికలపై జాతీయ విదేశాంగ గీతను దాటే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్తతోనే కేంద్రం ఈ ‘రెడ్ సిగ్నల్’ వేసిందన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రోటోకాల్ రక్షణ ముసుగులో విపక్ష నేతల విదేశీ మైలేజీని అడ్డుకుంటున్నారా లేక దౌత్యపరమైన నియమాలను కాపాడటమే లక్ష్యమా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








