2 వేల ఏళ్ల క్రితమే ‘గీత’ చెప్పిన అద్బుతమైన ‘మైండ్ మ్యాప్’
రాత్రి పదకొండు దాటింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. కానీ అతనికి మాత్రం నిద్ర రావడం లేదు. రేపు ఒక ఫోన్ కాల్ రావాలి. ఆ కాల్ అతని ఉద్యోగం ఉంటుందా, పోతుందా అన్నది నిర్ణయిస్తుంది.
ఫోన్‌ను పక్కన పెట్టాడు. రెండు నిమిషాలకే మళ్లీ తీసుకున్నాడు. నోటిఫికేషన్ ఏదీ లేదు. అయినా మరోసారి స్క్రీన్ చూశాడు.
“ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే?”
ఇక్కడే మనసు తన అసలు ఆట మొదలుపెడుతుంది.
ఇంటర్వ్యూ అయిపోయింది. అతను చేయాల్సిన పని కూడా అయిపోయింది. కానీ అతని మెదడు మాత్రం అక్కడి నుంచి బయటకు రావడం లేదు. తాను చెప్పిన సమాధానాలను మళ్లీ గుర్తు చేసుకుంటాడు. “ఆ ప్రశ్నకు ఇంకాస్త బాగా సమాధానం చెప్పాల్సింది” అని అనుకుంటాడు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకుంటాడు. వాళ్లు నవ్వారా? సీరియస్‌గా ఉన్నారా?
జరిగిపోయిన గంటను మనసు పదిసార్లు, ఇరవైసార్లు తిరిగి రివైండ్ చేస్తుంది. ఇది ఒక్క ఉద్యోగం విషయంలోనే కాదు. పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురుచూసే విద్యార్థి మనసులోనూ ఇదే జరుగుతుంది. ప్రేమలో ఒక మెసేజ్‌కు రిప్లై రాకపోయినా ఇదే. వ్యాపారంలో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అని ఎదురు చూసినా ఇదే.
మనిషి విచిత్రం ఏమిటంటే.. జరగబోయే విషయాన్ని ముందుగానే అనుభవించగలడు. ఓటమి ఇంకా రాలేదు. కానీ దాని బాధ వచ్చేసింది. తిరస్కరణ ఇంకా జరగలేదు. కానీ మనసు దాన్ని భరించేసింది. ఫలితం ఇంకా బయటకు రాలేదు. కానీ మనలో తీర్పు మాత్రం వచ్చేసింది.
దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అంటే నమ్ముతారా. ఆయన ఏమంటారంటే.. అంతా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది ఒక విషయాన్ని మనం గమనిస్తాం. దానిపై మళ్లీ మళ్లీ ఆలోచిస్తాం. కొంతకాలానికి అది మనకు ముఖ్యమైపోతుంది. అక్కడి నుంచి అనుబంధం పుడుతుంది. అనుబంధం కోరికగా మారుతుంది.
ఆ కోరిక తీరకపోతే నిరాశ. నిరాశ నుంచి కోపం. కోపం పెరిగితే మనం విషయాన్ని ప్రశాంతంగా చూడలేం. చివరికి సరైన నిర్ణయం తీసుకునే వివేకం కూడా దెబ్బతినొచ్చు. భగవద్గీత రెండో అధ్యాయంలోని 62–63 శ్లోకాలలో కనిపించే ఈ క్రమం చాలా సరళంగా అనిపిస్తుంది. కానీ మన రోజువారీ జీవితాన్ని దానితో పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.
ఒక ఉదాహరణకు సోషల్ మీడియానే తీసుకుందాం. మొదట మనం ఎవరో ఒకరి జీవితాన్ని చూస్తాం. మంచి ఇల్లు, కొత్త కారు, విదేశీ ప్రయాణం, విజయవంతమైన కెరీర్.. ఏదో ఒకటి మనకు నచ్చుతుంది. మళ్లీ అదే వ్యక్తి పోస్టులు చూస్తాం. మన జీవితంతో పోల్చుకుంటాం. కొద్దిరోజులకు ఒక ప్రశ్న మొదలవుతుంది. “వాళ్లకు ఉంది. నాకు ఎందుకు లేదు?”
ఇక అక్కడి నుంచి మన దగ్గర ఉన్న జీవితం చిన్నదిగా కనిపించడం మొదలవుతుంది. సమస్య ఆ కారు కాదు. ఆ ఇల్లు కాదు. ఆ వ్యక్తి కాదు. మనసు వాటి దగ్గరే ఆగిపోవడం.
కోరిక మనల్ని నడిపించాలి.. మనల్ని మింగేయకూడదు
కోరిక లేకుండా జీవితం ముందుకు వెళ్లదు. మంచి ఉద్యోగం కావాలి. పిల్లలు బాగా చదవాలి. సొంత ఇల్లు ఉండాలి. వ్యాపారం ఎదగాలి. మనం ప్రేమించే వాళ్లు మనతో ఉండాలి. ఇవన్నీ మనిషి సహజమైన కోరికలు. గీత చెప్పేది కోరికలన్నింటినీ వదిలేయమని కాదు. కోరికకు మనశ్శాంతిపై పూర్తి అధికారం ఇవ్వొద్దని. ఇది రెండింటి మధ్య చాలా పెద్ద తేడా.
ప్రమోషన్ కోసం కష్టపడటం ఒకటి. ప్రమోషన్ రాకపోతే “నేను పనికిరానివాడిని” అని భావించడం మరోటి. మంచి మార్కుల కోసం చదవడం ఒకటి. మార్కులు తక్కువ వస్తే “నా జీవితం అయిపోయింది” అనుకోవడం మరోటి. ప్రేమను కోరుకోవడం ఒకటి. ఎవరో తిరస్కరించారని “నాలోనే లోపం ఉంది” అని జీవితాంతం మోసుకెళ్లడం మరోటి. ఫలితం ఒక సంఘటన. దాన్ని మన వ్యక్తిత్వానికి తీర్పుగా మార్చుకోవడమే అసలు ప్రమాదం.
ఫలితంతో మనకున్న సంబంధమే అసలు చిక్కు
భగవద్గీతలోని నిష్కామ కర్మను చాలాసార్లు “ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం” అని ఒకే వాక్యంలో ముగించేస్తాం. కానీ మానవ జీవితంలో దాని అర్థం అంతకంటే లోతైనది. మన పని మన చేతిలో ఉండొచ్చు. కానీ ఆ పనికి వచ్చే ఫలితంలో మనతో పాటు మరెన్నో విషయాలు పనిచేస్తాయి.
ఒక విద్యార్థి ఎంత బాగా చదివినా పరీక్ష పేపర్ ఎలా వస్తుందో అతని చేతిలో ఉండదు. ఒక ఉద్యోగి ఎంత కష్టపడినా సంస్థలో పరిస్థితులు ఎలా మారతాయో అతని చేతిలో ఉండదు. ఒక రైతు ఎంత శ్రద్ధగా పంట వేసినా వాతావరణం అతని మాట వినదు.
అయినా మనిషి తన శక్తిని ఫలితంపైనే ఖర్చు చేస్తుంటాడు. పని అయిపోయిన తర్వాత కూడా పని చేస్తున్నట్టే అలసిపోతాడు. ఇదే ఫలాసక్తి. ఇక్కడే ఆధునిక సైకాలజీకి గీతకు దగ్గరవుతుంది
ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో కూడా ఫలితంపై అతిగా దృష్టి పెట్టడం కంటే, మనం చేయాల్సిన ప్రక్రియపై దృష్టి పెట్టడం ఒత్తిడిని తగ్గించడానికి, పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతారు.
ఒక క్రికెటర్‌కి “ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి” అనేది లక్ష్యం కావచ్చు. కానీ బంతి ఎదురుగా వచ్చినప్పుడు అతని దృష్టి స్కోర్‌బోర్డుపై ఉంటే షాట్ ఎలా ఆడగలడు?
అతని ముందు ఉన్నది ఒక్క బంతి. ఆ బంతిని సరిగ్గా ఆడటం మాత్రమే అతని పని. జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు ఇదే అవసరం. రేపటి ఫలితం గురించి వందసార్లు ఆలోచించే బదులు.. ఈరోజు చేయాల్సిన పని ఒక్కసారి సరిగ్గా చేయడం.
గీత చెప్పిన ‘మైండ్ మ్యాప్’లో చివరి ప్రమాదం ఇదే
ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మనమే పెంచుతాం. అది కోరిక అవుతుంది. కోరిక మన మీద పట్టు సాధిస్తుంది. అది నెరవేరకపోతే మనసు దాన్ని అవమానంగా, ఓటమిగా, అన్యాయంగా చూడటం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి కోపం, అసహనం, నిరాశ వస్తాయి. అంటే మనిషిని కూల్చేసేది చివర్లో కనిపించే కోపం మాత్రమే కాదు. దానికి చాలా ముందే మొదలైన ఆలోచనల ప్రయాణం. అందుకే గీత చెప్పిన ఈ మాటలు ఈరోజు కూడా మన జీవితానికి అద్దంలా అనిపిస్తాయి.
మన చేతిలో లేని ఫలితం కోసం మనం ఎంతసేపు ఆలోచిస్తున్నాం?
పని చేయి. శ్రద్ధగా చేయి. నీ శక్తి మొత్తం పెట్టు. కానీ ఫలితం రాకముందే దాని బాధను అనుభవించకు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ రేపటి భయంతో ఈరోజు ప్రశాంతతను కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది.
మనిషి జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కానీ వాటి కోసం మనసును ఎంతగా బాధ పెట్టుకోవాలో మాత్రం.. కొంతవరకు మన చేతుల్లోనే ఉంటుంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








