చైనా సరిహద్దుల్లో తెలుగు యాత్రికులు సురక్షితం..!
నేపాల్-చైనా సరిహద్దుల్లో సంభవించిన భారీ వరదలలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు యాత్రికులు చైనా భూభాగంలో సురక్షిత ప్రాంతంలో ఉన్నారని, వారితో ఆంధ్రప్రదేశ్ నోటిఫైడ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) అధికారులు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) వెల్లడించారు.
వీరితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన సుహానిరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్ బాబు, అలాగే కాకినాడకు చెందిన ఇద్దరు యాత్రికులు కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. అయితే, బాలసుబ్రమణ్యం అనే మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. హిమసరస్సు బద్దలవడంతో (GLOF) లెందే నది ఉప్పొంగి నేపాల్, చైనా సరిహద్దులను కలిపే అంతర్జాతీయ రహదారులు, కీలక వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
రోడ్డు మార్గం తీవ్రంగా దెబ్బతినడంతో ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థ, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ ప్రతికూల వాతావరణం, మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చైనా వైపున సురక్షిత స్థావరాలలో ఉంచినట్లు మంత్రి తెలిపారు. అక్కడి స్థానిక యంత్రాంగంతో ఏపీ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారని, చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ప్రస్తుతం సహాయక బృందాలు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే పనుల్లో ఉన్నాయని, అక్కడ పరిస్థితులు కాస్త చక్కబడగానే యాత్రికులందరినీ సురక్షితంగా సొంత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి మరియు తాజా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను (+91 863 2340678) అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థల నివేదికల ప్రకారం హిమాలయ సరిహద్దుల్లో రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి.








