జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేందుకే సంజీవని (Sanjeevani) లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు నిర్దేశించిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారును ఆదేశించారు. కుప్పం నియోజకవర్గం (Kuppam constituency) సహా చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. దీన్ని రాష్ట్రమంతా అమలు చేయాలి. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయాలి. ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలి అని పేర్కొన్నారు.








