గ్రామీణ ప్రతిభకు వదాన్య ఫౌండేషన్ చేయూత.. మంత్రి లోకేష్ ప్రశంసలు
గ్రామీణ ప్రతిభావంతులకు వదాన్య ఫౌండేషన్ చేయూత
ఈ ఏడాది జాతీయ సంస్థల్లో ముగ్గురు విద్యార్థులకు సీట్లు
ఫౌండేషన్ నిర్వాహకులకు మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి: వదాన్య ఫౌండేషన్ నిర్వాహకులు తమ ఆదాయం నుంచి కొంతభాగాన్ని పేదపిల్లల విద్యాభ్యాసం కోసం ఖర్చుచేసి, జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడంపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన అశోక్ పడపాటి వృత్తిరీత్యా హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించాలన్న సంకల్పంతో 2010లో అశోక్, అతని స్నేహితులు తమ జీతాల నుంచి కొంతభాగాన్ని పక్కనబెట్టి… వదాన్య ఫౌండేషన్ ను స్థాపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి, ప్రతిభగల విద్యార్థులను ఎంపికచేసి వారికి ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది వదాన్య ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన జుగేష్ కుమార్ ఐఐటీ మద్రాస్‌లో, తులసి కార్తీక్ భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) బెంగళూరులో, యశ్వంత్ కుమార్ రెడ్డి ఐఐటీ రూర్కీలో ప్రవేశాలు పొందారు. వీరంతా పదో తరగతి వరకు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినవారే. వదాన్య ఫౌండేషన్ అందించిన నిరంతర మార్గదర్శకత్వం, విద్యా సహాయం, జేఈఈ అడ్వాన్స్డ్ శిక్షణతో వారు ఈ ఘనతను సాధించారు.
వదాన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి, ఈ ఏడాది జాతీయస్థాయి సంస్థల్లో ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు సోమవారం ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను చిన్న వయస్సులోనే గుర్తించి ప్రోత్సహిస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటిని మంత్రి అభినందించారు. 9,10వ తరగతి విద్యార్థుల కోసం 500కు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలతో రూపొందించిన వదాన్య టాలెంట్ టెస్ట్ ప్రశ్నల పుస్తకాన్ని అశోక్… మంత్రికి అందజేశారు. ఫౌండేషన్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోటీపరీక్షలకు అవసరమైన కొశ్చన్ బ్యాంక్ రూపకల్పనకు వదాన్య సహకారం తీసుకుంటామని అన్నారు. అలానే ఇటువంటి టాలెంట్ టెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, ప్రతిభావంతులను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.








