మంగళగిరి ప్రజలకు లోకేశ్ గుడ్‌న్యూస్.. 3 వేల కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులు
మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి భూయాజమాన్య సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ‘మన ఇల్లు – మన లోకేశ్’ (Pedalaku Pattabhishekam) కార్యక్రమంలో భాగంగా రెండో విడత కింద మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని సుమారు 3,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు, ఆస్తి అనుభవ ధృవీకరణ పత్రాల పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. సీకే కన్వెన్షన్‌లో జూలై 21, 22 తేదీలలో (నేడు, రేపు) ఈ కార్యక్రమం కొనసాగనుంది.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాదాయ మరియు వివిధ ప్రభుత్వ భూముల్లో వేలాది పేద కుటుంబాలు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. అయితే ఆ స్థలాలపై అధికారికంగా ఎలాంటి హక్కులు లేకపోవడంతో, అత్యవసర సమయాల్లో బ్యాంక్ లోన్లు పొందేందుకు లేదా ఆ ఆస్తిని తమ వారసులకు బదిలీ చేసేందుకు వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గమనించిన నారా లోకేశ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వీరందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని 2024 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
అన్నట్లుగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ స్థలాలను క్రమబద్ధీకరించి పేదలకు యాజమాన్య హక్కులను కల్పించారు. ఇంతకుముందు ఏప్రిల్ 2025లోనే మొదటి విడత కింద రత్నాలచెరువు, ఎర్రబాలెం, నీరుకొండ ప్రాంతాల్లోని 3,002 కుటుంబాలకు మంత్రి లోకేశ్ ఇళ్ల పట్టాలను విజయవంతంగా అందజేశారు. ఆ మొదటి విడతలో పంపిణీ చేసిన భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 1,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న రెండో విడతలో ఇస్తున్న భూముల విలువ కూడా దాదాపు మరో రూ. 1,000 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించారు.
ఈ నిర్ణయంతో పేద కుటుంబాల చేతుల్లోకి వేల కోట్ల రూపాయల శాశ్వత సంపద చేరినట్లయింది. ఈ పట్టాల పంపిణీలో కేవలం పత్రాలు ఇవ్వడమే కాకుండా, పట్టా అందుకోనున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక గౌరవం లభించింది. లబ్ధిదారులైన పురుషులకు ప్యాంటు-షర్టు ముక్కలు, మహిళలకు చేనేత పట్టు వస్త్రాలను బహుమతిగా అందిస్తూ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న అభద్రతా భావాన్ని తొలగించి, తమ ఇళ్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించినందుకు మంగళగిరి ప్రజలు మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.








