ఏడాదికి 20 వేలకోట్ల సంపాదన.. ట్రంప్ ఆదాయం అదరహో..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వ్యాపార వేత్తగా సత్తా చాటుతూనే ఉన్నారు.అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన నాటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ వ్యాపారంలో అంతులేని లాభాలు గడిస్తున్నారు. ఏడాది కాలంలో ఆయన వ్యాపార సామ్రాజ్యం 2.2 బిలియన్ డాలర్ల (సుమారు 20 వేల కోట్ల రూపాయలు) ఆదాయం ఆర్జించింది. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ నైతిక విభాగానికి ఆయన సమర్పించిన ఆర్థిక నివేదిక ఈ విషయం వెల్లడించింది. ‘‘ద ట్రంప్ ఆర్గనైజేషన్’’ అనే బడా వ్యాపార సంస్థకు డొనాల్డ్ ట్రంప్ యజమానిగా ఉన్నారు. ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు ఈ సంస్థకు ట్రస్టీలుగా, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ద ట్రంప్ ఆర్గనైజేషన్ క్రిప్టో కరెన్సీ నుంచి విలాసవంతమైన గోల్ఫ్ క్లబ్బుల వరకూ అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఆయన అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి పూర్వం 2024 సంవత్సరంలో కేవలం 622 మిలియన్ డాలర్ల ఆదాయం పొందిన ట్రంప్ సంస్థ 2025లో అందుకు దాదాపు నాలుగింతల ఆదాయం ఆర్జించింది.
డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ఒక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యాపారంలో బిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు! సెలబ్రేషన్స్ కాయిన్స్ అనే సంస్థ నుంచి 635 మిలియన్ డాలర్లు రాయల్టీ రూపంలో లభించింది. ట్రంప్ కుమారులు, ఆయన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లు స్థాపించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ నుంచి అమెరికా అధ్యక్షునికి మరో 500 మిలియన్ డాలర్ల ఆదాయం కలిసివచ్చింది. రియల్ ఎస్టేట్ తదితర వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆయన మిలియన్ల కొద్దీ డాలర్లు గడించారు. అయితే ఇవన్నీ ఆయన తన అధ్యక్ష పీఠాన్ని అడ్డం పెట్టుకొని గడించినవి కాదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. 1978 నాటి చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆస్తులతో పాటు ఆదాయాన్ని క్రమం తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.
ట్రంప్ తన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వ్యాపారం ద్వారా గవర్నెన్స్ టోకెన్లు సహా కొత్త క్రిప్టో ఉత్పత్తులను విక్రయించి 500 మిలియన్ డాలర్లకు పైగా పొందారు. ట్రంప్ ముఖాన్ని ముద్రించిన స్మారక మీమ్ నాణేల అమ్మకాల ద్వారా మరో క్రిప్టో వ్యాపార సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ 600 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.
అయితే, అమ్మకాల తర్వాత టోకెన్లు నాణేల విలువ భారీగా పడిపోయింది. ట్రంప్ గత సంవత్సరం తన బ్రాండెడ్ బైబిళ్లు, స్నీకర్లు, ఇతర చిన్న వస్తువులను అమ్మడం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జించారు. కేవలం బ్రాండెడ్ వాచీల అమ్మకం ద్వారానే ఆయనకు 4.7 మిలియన్ డాలర్లు సమకూరాయి. ట్రంప్ నికర ఆస్తి విలువ 2024లో 2.3 బిలియన్ డాలర్లు ఉండగా, నేడు 6 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.








