ట్రంప్ నకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!
అమెరికా సుప్రీంకోర్టులో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని (Birthright Citizenship) పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, మంగళవారం 6-3 మెజారిటీతో ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తుందనే రాజ్యాంగ సూత్రాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
మెజారిటీ సభ్యుల తరఫున ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా దేశంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన సంతానం కూడా దేశ అధికార పరిధికి లోబడి ఉంటారని, తద్వారా వారు పౌరసత్వానికి సంపూర్ణ అర్హులని ఆయన స్పష్టం చేశారు. “రాజ్యాంగ నిర్మాతలు ఈ వాగ్దానాన్ని దేశంలోని ప్రతి స్వేచ్ఛా జీవికి అందించారు. నేడు ఆ వాగ్దానాన్ని మేము నిలబెడుతున్నాం,” అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే, అంటే 2025 జనవరి 20న, డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు 14160పై సంతకం చేశారు. చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న తల్లులకు జన్మించే పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని దీని ద్వారా ఫెడరల్ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో, దిగువ కోర్టులు వీటి అమలుపై గతంలోనే స్టే విధించాయి.
1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం-అమెరికాలో పుట్టేవారందరికీ (వారి తల్లిదండ్రులు ఆ దేశంలో అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉంటున్నా సరే) ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం అమెరికాకు చాలా చేటని తెలిపారు. దానిపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు తాను సిద్ధమని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ‘‘అనుచితమైన ఈ జన్మతః పౌరసత్వ హక్కుకు ముగింపు పలికేందుకు కాంగ్రెస్ వెంటనే పని ప్రారంభించాలి’’ అని పిలుపునిచ్చారు.








