అమెరికా అమ్ములపొదిలో లాంగ్ రేంజ్ మిస్సైల్ మాలిస్..!
అమెరికా సరికొత్త యుద్ధవ్యూహాన్ని సిద్ధం చేసింది. దానిలో భాగంగా సరికొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా సుదూరం నుంచే శత్రు ముప్పును ఛేదించేలా సరికొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని (Air to Air Missile) యూఎస్ నేవీ ఆవిష్కరించింది. ‘మాలిస్ (Malice)’గా పిలిచే ఈ దీర్ఘశ్రేణి క్షిపణి వందల కిలోమీటర్ల దూరం నుంచే విమానాలను కూల్చగలదని అగ్రరాజ్యం (USA) చెబుతోంది.
మాలిస్ గేమ్ చేంజర్…
మాలిస్ క్షిపణి సాంకేతిక పేరు AIM-424 LRAAM. రేథియాన్ సంస్థతో కలిసి అమెరికా నౌకాదళం అత్యాధునిక ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని అభివృద్ధి చేసింది. పొడవు 4.11 మీటర్లు.. 680 కిలోల బరువుండే ఈ క్షిపణిలో సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ప్రొపల్షన్ అమర్చారు. శత్రువు టార్గెట్‌ను గుర్తించిన వెంటనే.. దాన్ని కూల్చివేసేలా రూపొందించారు. 250 నాటికల్ మైళ్ల (463 కిలోమీటర్ల) దూరంలో ఉండే లక్ష్యాలను ఇది ఛేదించగలదు. గగనతల లక్ష్యాలను టార్గెట్ చేసే క్షిపణిల్లో ఇదే ఇప్పటివరకు అత్యంత లాంగ్ రేంజ్ మిసైల్. దీంతో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలకు చేరువగా వెళ్లాల్సిన పని ఉండదు. అప్పుడు యుద్ధ క్షేత్రంలో అగ్రరాజ్యం వైపు తక్కువ నష్టం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏఐఎం-424 క్షిపణిని ప్రధానంగా ఎఫ్-35సీ యుద్ధ విమానాల కోసం డిజైన్ చేశారు. దీంతో పాటు F/A-18E/F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లలోనూ వీటిని అమర్చేందుకు కూడా పరీక్షలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన టెస్ట్ ఈవెంట్లో ఈ క్షిపణులను యుద్ధ విమానాలకు అమర్చిన ఫొటోలను అమెరికా నేవీ విడుదల చేసింది.
మాలిస్ టార్గెట్స్…
శత్రుదేశ యుద్ధ విమానాలు, దీర్ఘ శ్రేణి బాంబర్లు, గగనతల నియంత్రణ విమానాలు, ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య విమానాలు, ఏరియల్ రీఫ్యుయలింగ్ ట్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ క్షిపణులు లక్ష్యంగా చేసుకుంటాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ క్షిపణిని నేవీ ఆవిష్కరించినా.. వాటిని ఎప్పుడు, ఎక్కడ వినియోగిస్తారన్న వివరాలను మాత్రం అమెరికా బయటపెట్టలేదు.








