పాక్ టెర్రరిస్టు దేశమే..! జైషే హెడ్ క్వార్టర్స్ పునరుద్ధరణ..!
ఇటీవలి కాలంలో పాక్ ఉగ్రవాద ముసుగు తొలగిపోతోంది. ముసుగు తొలగిపోతోందని చెప్పడం కంటే.. నేరుగా ఆదేశ ప్రభుత్వం, నేతలు, అధికారులు.. బహిరంగంగా తమ విధానాలను బయటపెడుతున్నారు. ఇన్నాళ్లు తమది ఉగ్రవాద బాధిత దేశమని చెప్పుకున్న పాకిస్తాన్.. ఇటీవలి కాలంలో తాము ఉగ్రవాదులకు మద్దతుదారులమని చెప్పకనే చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత అదీ మరీ బహిర్గతమైంది. ఏకంగా ఉగ్రనాగు జైషే హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి చేయూతనివ్వడం ద్వారా ప్రపంచం దృష్టిలో మరోసారి ఉగ్రదేశంగా పాక్ నిలుస్తోంది.
జైషే ఉగ్రవాద సంస్థ.. ఆపరేషన్ సిందూర్ తో ధ్వంసమైన తమ ప్రధాన కార్యాలయాన్ని మళ్లీ పునరుద్ధరించింది. దీనికి పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థికంగా అండదండలు అందించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ ఘటనతో పాక్ మరోసారి తన ఉగ్రబుద్ధిని చాటుకున్నట్లు అయింది. జైషే కార్యాలయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు, భవనంలో కొత్తగా వేసిన మార్బుల్స్, పెయింట్లు, నూతనంగా నిర్మించిన డోమ్‌ల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో జైషే ప్రధాన కార్యాలయం ఉంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా గతేడాది మే 7న భారత ఆర్మీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. ఈ ఘటనలో జైషే చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబం అంతమైంది. ఈ దాడిలో 10 మంది అజార్ కుటుంబ సభ్యులు చనిపోయారు. దీంతో పాక్‌లో ఉన్న ఉగ్రమూలాల గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంతా జరిగినా పాక్ బుద్ధిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఆ ఉగ్ర సంస్థ ధ్వంసమైన భవానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నా.. అడ్డుకోలేకపోగా.. అందుకు బదులుగా ఆర్థిక సాయం చేసి తన పాత్రను రుజువు చేసుకుంది. కార్యాలయ నిర్మాణానికి వాయిదాల రూపంలో 25 కోట్ల పాక్ రూపాయలను ఇచ్చినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం ఆ భవనం పునర్నిర్మాణ పనులు పూర్తై మళ్లీ ఉగ్ర కార్యకలాపాలను సాగించేందుకు సిద్ధమైంది.
ప్రధాన కార్యాలయంలో క్యాడర్‌కు శిక్షణ, సిద్ధాంతాలు బోధిస్తారు. మొత్తం 18 ఎకరాల్లో ఇది ఉంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకోవడం, పుల్వామా ఆత్మాహుతి దాడి తదితర వ్యూహాలు ఇక్కడే పన్నినట్లు సంబంధిత వర్గాలు చెబుతుంటాయి.








