ఏఈ నూకరాజు కుటుంబంపై విజయసాయిరెడ్డి సంచలనం..!
కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఉదంతంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘోర ఆత్మహత్యల వెనుక పెద్ద మత మార్పిడి కుట్ర దాగి ఉందంటూ నివ్వెరపోయే ఆరోపణలు చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ‘లవ్ జిహాద్’ కార్యకలాపాలు మొదలయ్యాయని, అప్పట్లో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా మత మార్పిడిలను తీవ్రంగా ప్రోత్సహించారని ఆయన ధ్వజమెత్తారు. ఆ అండతోనే సాదిక్ ఖాన్ లాంటి కరడుగట్టిన నేరస్థులు రెచ్చిపోయారని మండిపడ్డారు.
సాదిక్ ఖాన్ చేసిన క్రూరమైన వేధింపుల వల్లే తట్టుకోలేక ఏఈ నూకరాజు తన కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం లవ్ జిహాద్ పేరిట వేధించడమే కాకుండా, రావులపాలెంలో నూకరాజుకు చెందిన దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ప్రాపర్టీని సాదిక్ ఖాన్ బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నాడని ఆరోపించారు. మత మార్పిడిలే లక్ష్యంగా చేసుకొని హిందూ కుటుంబాలలోని మహిళలను వేధించడం, ఆపై వారి ఆస్తులను అక్రమంగా లాక్కోవడమే ఈ ముఠా పని అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
ఈ మత మార్పిడి నెట్వర్క్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాదిక్ ఖాన్‌తో పాటు మరో 9 మందితో కూడిన ఒక టెర్రరిస్ట్ ముఠా కాకినాడ, రాజమండ్రి నగరాల్లో ఇప్పటివరకు దాదాపు 15 కుటుంబాలను టార్గెట్ చేసి తీవ్రంగా వేధించిందని కీలక విషయాలు బయటపెట్టారు. ఈ దారుణాలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, సాదిక్ ఖాన్ వెనుక ఉన్న టెర్రరిస్ట్ లింకులపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.








