మక్కా డిఫెన్స్ డీల్ పై బంగ్లాదేశ్ ఆసక్తి.. భారత్ కు డేంజర్ సిగ్నల్స్..?
మక్కా జాయింట్ డిఫెన్స్ డీల్.. ఈ ఒప్పందం గల్ఫ్ దేశాలతో ముస్లిం దేశాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే నాటోను పోలిన విధంగా దీన్ని ఆయా దేశాలు డిజైన్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్ పరస్పరం దాడులతో ఆందోళనకరంగా మారింది. ఇటీవలి కాలంలో గాజా స్ట్రిప్ పైనా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ రక్షణ వ్యవస్థ నడ్డి విరిగింది. ఈపరిణామాలతో తాము సురక్షిత వాతావరణంలో ఉండాలని పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ భావిస్తోంది.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీల మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’లో చేరేందుకు బంగ్లాదేశ్ సానుకూలంగా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ముఖ్య సలహాదారు హుమయూన్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌదీ-పాక్-టర్కీ త్రైపాక్షిక రక్షణ కూటమిలో బంగ్లాదేశ్ చేరడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… బంగ్లాదేశ్ తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందంలో చేరే అంశాన్ని పరిశీలిస్తోందని ప్రధాని సలహాదారు హుమాయున్ కబీర్ తెలిపారు.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు ఈ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశాయి. నాటోలోని ‘ఆర్టికల్ 5’ నిబంధన మాదిరిగానే, ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తూ సంయుక్త ప్రతిఘటన చేపడతారు.
టర్కీ ఇప్పటికే బంగ్లాదేశ్‌కు నాలుగో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ కూడా ఈ కూటమి వైపు మొగ్గు చూపడం ….దక్షిణాసియా, పశ్చిమ ఆసియా భద్రతా సమీకరణాలపై, ముఖ్యంగా పొరుగున ఉన్న భారత్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.








