సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… దిగ్గజ నటి పద్మశ్రీ ‘షావుకారు’ జానకి కన్నుమూత
దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర తారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.








