క్యాన్సర్ రోగులకు తీపి కబురు..
ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు చొరవతో ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో కాకినాడ జీజీహెచ్‌లో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలతో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటు కానుంది.
కీలక పరిణామాలు..
ఆగష్టు 3: కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్స మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ను కలిసి వినతీ పత్రం అందజేశారు. కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో ఆధునిక రేడియేషన్ థెరపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
ఆగష్టు 7: ఓఎన్జీసీ నుంచి కాకినాడ జీజీహెచ్‌కు ఒప్పంద పత్రం పంపించారు. క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు అందించేందుకు ఓఎన్జీసీ ముందుకొచ్చింది.
ఆగష్టు 12: కాకినాడ జీజీహెచ్ అధికారులు ఓఎన్జీసీ పంపిన ఒప్పందంపై సంతకం చేసి తిరిగి పంపించారు. దీంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది.
రూ.48 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అధునాతన వైద్యం..
ఓఎన్జీసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా కాకినాడ, గుంటూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాల కోసం సుమారు రూ.48 కోట్లను కేటాయించేందుకు అంగీకరించింది. ఇందులో ఒక్కో కేంద్రానికి సుమారు రూ.16 కోట్ల చొప్పున కేటాయించనున్నారు.
కాకినాడ జీజీహెచ్‌లో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. చికిత్స కేంద్రానికి అవసరమైన యంత్ర సామగ్రిని కూడా ఓఎన్జీసీ సమకూర్చనుంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట..
ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వస్తుంటారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి రావడంతో రోగుల కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతోంది.
కాకినాడ జీజీహెచ్‌లోనే అధునాతన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వస్తే వేలాది మంది రోగులకు ప్రయోజనం కలగడంతో పాటు, లక్షల రూపాయల వైద్య ఖర్చులు మరియు సుదూర ప్రయాణాల భారం తగ్గనుంది.
ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవ ఫలితం..
కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఎంపీ సానా సతీష్ బాబు ఢిల్లీలో ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ రోగుల పరిస్థితిని, పేదలకు ఈ సదుపాయం ఎంత అవసరమో వివరించారు. ఎంపీ సానా సతీష్ బాబు నిరంతర ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ఓఎన్జీసీ సహకారంతో ఇప్పుడు ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది.
త్వరలో సేవలు అందుబాటులోకి..
క్యాన్సర్ చికిత్స కేంద్రం కోసం అవసరమైన మౌలిక వసతులు, పరికరాల ఏర్పాటు పూర్తయిన అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్స సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్యం మరింత చేరువ కానుంది.








