ఇరాన్ గుప్పిట నుంచి బయటపడుతున్న హర్మూజ్..!
పశ్చిమాసియా యుద్ధంలో కీలకమైన అంశం హర్మూజ్ జలసంధి. ఈ మార్గంపై నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ .. ఢీ అంటే ఢీ అంటున్నాయి. లేటెస్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్…. ‘హర్మూజ్ (Strait of Hormuz) ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్‌పై ఇరాన్ (Iran) 80శాతం పట్టు కోల్పోయినట్లేనని తెలుస్తోంది. (US-Iran War)
హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐక్యరాజ్యసమితి అధీకృత రవాణా మార్గం. అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్.. ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది.
ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్‌ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతున్నాయి..
కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్‌ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని డేంజర్ జోన్ వెలుపలకు చేరుకున్నాక.. కస్టమర్ ట్యాంకర్లలో చమురును నింపుతున్నాయి. అయితే, హర్మూజ్‌ను దాటే క్రమంలో ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని వారాల పాటు ఇవి తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ జలసంధి నుంచి ప్రయాణిస్తోన్న అన్ని నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. తాము సూచించిన మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, తద్వారా చమురు రవాణా నిరాటంకంగా సాగేందుకు కృషి చేస్తున్నామని అగ్రరాజ్యం చెబుతోంది. ఇటీవల అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ మాట్లాడుతూ.. హర్మూజ్ మీదుగా గతవారం రోజుకు సగటున 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు పేర్కొన్నారు. యుద్ధం ముందు నాటి పరిస్థితికి (సగటున రోజుకు 20 మిలియన్ బ్యారెళ్లు) చేరుకుంటున్నామని తెలిపారు. అందువల్లే ‘హర్మూజ్ మా భూభాగమే’ అని ట్రంప్ ప్రకటించుకున్నారు.
వాస్తవానికి అమెరికాతో చర్చిస్తోన్న అవగాహన ఒప్పందం ప్రకారం.. హర్మూజ్‌లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసేందుకు ఇరాన్‌కు అవకాశం లభించనుంది. దీన్ని గల్ఫ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సూచించిన ఒమన్ మార్గాన్ని నౌకలు ఎంచుకోవడానికి ఈ టోల్ కూడా ఓ కారణమనే చెప్పొచ్చు.
ఇప్పుడు హర్మూజ్‌పై ఆధిపత్యం తగ్గితే టెహ్రాన్‌కు ఆర్థికంగానూ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు, ఈ జలసంధిపై పట్టు పెంచుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్‌తో ఒప్పందం కుదిరిందని టెహ్రాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, హర్మూజ్ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఒమన్‌పై బాంబులేస్తామని అమెరికా బెదిరించడంతో ఈ ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది.








