వాళ్ల యుద్ధం.. మన బిల్లు! భారత్‌లో పెట్రోల్ ధరలపై కొత్త టెన్షన్?
పెట్రోల్ బంక్‌కు వెళ్లారు.
మీ కారు ట్యాంక్ ఖాళీగా ఉంది. మీకు కావాల్సింది కొన్ని లీటర్ల పెట్రోల్ మాత్రమే. అందుకు ఎంత చెల్లించాలి? ఇప్పుడు పెట్రోలు రేటు ఎంత ఉంది.. ఇవన్నీ నిర్ణయిస్తున్నది మీ ఊర్లోని బంక్ యజమాని కాదు. మన దేశ ప్రభుత్వం కూడా కాదు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో.. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక పోరాటం.
ఒక వైపు అమెరికా.
మరో వైపు రష్యా.
వాళ్ల మధ్య యుద్ధం, ఆంక్షలు, ప్రతీకారాలు. మరి మనం? మధ్యలో నిలబడి.. ఆ బిల్లు మనమే కట్టాల్సి వస్తుందా? , ఇదేమీ ఊహ కాదు. భారత్ ముందు నిలిచిన సమస్య. చివరికి నష్టపోయేది ఎవరు? జవాబు మాస్కోలో లేదు. వాషింగ్టన్లో లేదు. మీ పెట్రోల్ బంక్ దగ్గరే, మీ జేబు పైనే పడే భారమే సమాధానం.
అసలు ఏమటి సమస్య?
అమెరికా, రష్యా మధ్య పోరు కొత్తది కాదు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఆంక్షలు, ప్రతిఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పోరులోకి భారత్ మళ్లీ లాగబడే పరిస్థితి కనిపిస్తోంది.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురును అమెరికా మరోసారి టార్గెట్ చేస్తోంది. రష్యన్ ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే బిల్లు ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌లో ముందుకు వస్తోంది.
ఈ బిల్లు చట్టంగా మారితే.. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంటుంది. ఆ జాబితాలో భారత్, చైనా, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక విషయం కీలకం. బిల్లు చట్టంగా మారినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం సుంకం పడిపోదు. దాన్ని అమలు చేయాలా వద్దా అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మనం తల పట్టుకునే విషయం వేరే ఉంది. అమెరికా రష్యాను శిక్షించాలనుకుంటోంది.అది దాని ఇష్టం. మరి ఆ శిక్షలో భారత్ ని ఎందుకు ఇరికించాలి?
భారత్ ..రష్యా చమురును ఎందుకు వదులుకోలేకపోతోంది?
ఇది కేవలం రష్యాతో స్నేహం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. భారత్‌కు ఇది అవసరం.మన దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అందులో రష్యా ఇప్పుడు అతిపెద్ద సరఫరాదారుగా మారింది.
2026 జూన్‌లో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో ఏకంగా 46 శాతం రష్యా నుంచే వచ్చింది. ఒక్క నెలలోనే రష్యా నుంచి 87.5 లక్షల టన్నుల చమురు భారత్‌కు వచ్చింది. రెండో స్థానంలో ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన చమురు 42 లక్షల టన్నులు. అంటే భారత్‌కు రష్యా కేవలం మరో చమురు సరఫరాదారు కాదు. దేశ ఇంధన భద్రతలో కీలకమైన భాగం.
రష్యా చమురు భారత్‌కు ఎందుకు ఇంత ముఖ్యమైంది?
2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై భారీ ఆంక్షలు విధించాయి. యూరప్ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. అప్పుడు రష్యా తన చమురును ఆసియా మార్కెట్ల వైపు మళ్లించింది. భారత్, చైనా వంటి దేశాలకు తక్కువ ధరకు చమురు విక్రయించడం ప్రారంభించింది.
భారత్‌కు అది ఒక అవకాశం. దేశానికి అవసరమైన చమురు తక్కువ ధరకు దొరికింది. అంతర్జాతీయ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధర. దాంతో 2025 ఆర్థిక సంవత్సరంలో రష్యా భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. ఆ ఏడాది రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం విలువ 56.9 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.5.4 లక్షల కోట్లు. ఇప్పుడు ఇదే విషయం అమెరికాకు సమస్యగా కనపడుతోంది.
అమెరికా ఒత్తిడి పెరిగితే భారత్ ఏం చేస్తుంది?
ఇది ఇప్పటికే ఒకసారి జరిగింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లతో సంబంధం ఉన్న కొన్ని భారతీయ ఎగుమతులపై అదనంగా 25 శాతం పెనాల్టీ విధించింది. దీంతో రష్యా నుంచి భారత్ దిగుమతులు తగ్గాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అవి ఏడాది క్రితంతో పోలిస్తే 14 శాతం తగ్గి 23.1 బిలియన్ డాలర్లకు చేరాయి. అయినా భారత్ రష్యా చమురును పూర్తిగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం అంత సులభం కాదు.
అసలు సమస్య ఇక్కడే ఉంది.. హోర్ముజ్!
రష్యా నుంచి చమురు తగ్గించాలంటే భారత్ ఇతర దేశాలపై ఆధారపడాలి. కానీ పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరో సమస్యను సృష్టించాయి.అదే హోర్ముజ్ జలసంధి. భారత్ దిగుమతి చేసుకునే చమురు, గ్యాస్‌లో దాదాపు సగం ఈ కీలక సముద్ర మార్గం మీదుగా వస్తుంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి ముఖ్యమైన సరఫరాదారుల చమురు కూడా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది.
అక్కడ రవాణా దెబ్బతింటే.. భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అందుకే రష్యా చమురు భారత్‌కు మళ్లీ వ్యూహాత్మకంగా ముఖ్యమైంది.
అమెరికా కూడా ఒక దశలో వెనక్కి తగ్గింది
ఇదే కారణంతో 2026 ఫిబ్రవరిలో అమెరికా తన వైఖరిని కొంత సడలించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో సరఫరా సంక్షోభం రాకుండా, ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించేందుకు తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు మళ్లీ కుదించబడే పరిస్థితి కనిపిస్తోంది.
హోర్ముజ్‌లో రవాణా ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఇరాన్-అమెరికా చర్చల్లోనూ పెద్ద పురోగతి కనిపించడం లేదు. దీని ప్రభావం చమురు ధరలపై ఇప్పటికే కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ఒక దశలో బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా వెళ్లింది. తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత జూన్‌లో 80 డాలర్ల కంటే దిగువకు వచ్చినా.. ఆగస్టు మధ్య నాటికి మళ్లీ 90 డాలర్లకు చేరింది. ఇక్కడి నుంచి భారత్‌కు అసలు భయం మొదలవుతుంది.
రష్యా చమురు ఆగితే.. వెంటనే పెట్రోల్ రూ.200 అవుతుందా?
అలా నేరుగా చెప్పలేం కానీ.. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. చమురు దిగుమతి ఖర్చు పెరిగితే.. భారత్‌పై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట్ చెబుతున్నదీ ఇదే. రష్యా చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపాల్సి వచ్చినా భారత్ ఇతర సరఫరాదారుల వైపు వెళ్లొచ్చు. కానీ సమస్య ధర. ఉదాహరణకు పశ్చిమాసియా నుంచి చమురు తెచ్చే రవాణా ఖర్చు సాధారణంగా బ్యారెల్‌కు 40-70 సెంట్లు ఉంటుంది. అదే అమెరికా నుంచి చమురు తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చు బ్యారెల్‌కు 2.5-4 డాలర్లు వరకు ఉండొచ్చు. అంటే చమురు దొరుకుతుంది. కానీ ఖర్చు పెరుగుతుంది.
ఈ కథలో అసలు బాంబ్.. రూ.1.4 లక్షల కోట్లు
రష్యా చమురుపై డిస్కౌంట్ ఎంత వస్తుందన్నదానికంటే ఇప్పుడు ప్రపంచ చమురు ధర ఎంత పెరుగుతుందన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. Kotak Securities కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ ప్రకారం.. 2022లో రష్యన్ చమురు అంతర్జాతీయ ధర కంటే 15-20 డాలర్లు తక్కువకు లభించేది.
ఇప్పుడు ఆ డిస్కౌంట్ కేవలం 2-3 డాలర్లకు తగ్గిపోయింది. అంటే రష్యా చమురు వల్ల భారత్ పొందుతున్న ధర ప్రయోజనం గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయింది. కానీ మరో లెక్క మాత్రం చాలా పెద్దది. అంతర్జాతీయ చమురు ధర బ్యారెల్‌కు కేవలం 10 డాలర్లు పెరిగినా.. భారత్ వార్షిక చమురు దిగుమతి బిల్లు సుమారు 15 బిలియన్ డాలర్లు, అంటే రూ.1.4 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఇదే అసలు భయం.
చివరికి బిల్లు ఎవరు కడతారు?
చమురు ధర పెరిగితే దాని ప్రభావం కేవలం పెట్రోల్ బంక్ దగ్గరే ఆగదు. రవాణా ఖర్చులు పెరుగుతాయి. సరుకుల రవాణా ఖరీదవుతుంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. చివరికి అనేక వస్తువుల ధరలపై ఒత్తిడి వస్తుంది.సామాన్యుడి జేబుకే చెల్లు పడుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








